దేశంలో రోజుకో కొత్త బాబా పుట్టుకొస్తున్నాడు. ఎంత మంది బండారాలు బయపడ్డా.. ప్రజలు ఇంకొ దొంగ బాబాను నమ్మి.. వాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. అలాంటి మరో కొత్త దొంగ బాబాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్‌కు అంతగా రెవెన్యూ లేదని భావించి.. జనాలు భక్తిని సొమ్ము చేసుకుంటే మార్కెట్ పెంచుకోవచ్చని... బాబాగా అవతారమెత్తిన బీటెక్ బాబును అదుపులోకి తీసుకున్నారు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సాఫ్ట్‌వేర్ బాబా రాసలీలను బట్టబయలు చేశారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీ దివాలా..
ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విశ్వచైతన్య... డిగ్రీ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నల్లకుంటలో కంప్యూటర్ కేంద్రం ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన వినియోగదారుల నుంచి కోటి రూపాయలు అప్పు చేసి పారిపోగా... బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 20 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చాక... సాయిబాబా భక్తుడిగా చెప్పుకుంటూ పురోహిత్యం, సాయిచరితం ప్రవచనాలను వివిధ ఛానళ్లలో చెప్పేవాడు. 2017లో సొంతంగా శ్రీసాయి సర్వస్వం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అపాయింట్మెంట్ కోరిన వారికి చరవాణి ద్వారా... సలహాలు, సూచనలు ఇచ్చేవాడు.
40 మంది మహిళలతో లైంగిక సంబంధాలు..
ఇదే క్రమంలో మూడేళ్ల క్రితం నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురంలోని 10 ఎకరాల స్థలంలో శ్రీసాయి సర్వస్వం మాన్సి ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశాడు. ఇతడి నిజస్వరూపం గురించి తెలియని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఆన్‌లైన్, చరవాణి ద్వారా సంప్రదించారు. మొదట్లో తక్కువ ఫీజు తీసుకొని, మాయమాటలు చెప్పి నమ్మించాడు. తనను పూర్తిగా నమ్మిన భక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని.. వారితో అసభ్యంగా చాటింగ్ చేయడం, ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నవారి నుంచి డబ్బులు, ఆస్తులు విరాళాలుగా తీసుకోవడం చేసేవాడు. చరవాణిలో సంప్రదించే మహిళల్లో ఆర్థికంగా బాగా ఉన్నవారిని గుర్తించి... ప్రవచనాల పేరుతో ఆకర్షించేవాడు. తన ట్రాప్‌లో పడిన మహిళలను లోబర్చుకునేవాడు. అలా దాదాపు 40 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.