ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ఇంటర్వ్యూ.. కవర్‌పేజీపై మీ ఫొటో వేయిస్తానంటూ ఎంతోమంది ప్రముఖులను బోల్తా కొట్టించాడు ఓ కేటుగాడు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల-రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఉద్యోగులందరికీ టీకాలు వేయిస్తానంటూ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దగ్గర రూ.లక్ష, మరో టాలీవుడ్ ప్రముఖ నటుడి నుంచి రూ.73 వేలు వసూలు చేశాడు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ నిర్వాహకుల నుంచి రూ.1.5 లక్షలు కొల్లగొట్టాడు. సదరు ఛానెల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు నిందితుడు నాగార్జునరెడ్డి (27)ని సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ఈనెల 14న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించగా నిందితుడి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి.
పోలీసులకు చెప్పే వరకు కూడా..
ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు నిందితుడి బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. ఒకే ఒక్క బ్యాంక్ ఖాతా ఉండగా అందులో రూ.38 మాత్రమే ఉన్నాయి. పైగా ఆ ఖాతాను వేరే కేసులో పోలీసులు స్తంభింపజేశారు. ఆ తర్వాత లోతుగా ఆరా తీయగా నిందితుడు తన తల్లి ఖాతాను వినియోగిస్తున్నట్లుగా తేల్చారు. అంతేకాదు ఆ ఖాతాలో నగదు పడగానే వెంటనే విత్‌డ్రా చేసేవాడు. అందులో ఎవరెవరు డబ్బులు జమ చేశారని ఆరా తీయగా పలువురు ప్రముఖులు, చలనచిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ జాబితాలోని కొందరికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. అప్పటివరకు సదరు ప్రముఖులకు తాము మోసపోయినట్లు తెలియదు. సైబర్‌క్రైం పోలీసుల సూచన మేరకు టాలీవుడ్ ప్రముఖ నటుడు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో, నిర్మాత సురేష్ బాబు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.