ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమయ్యాడు. 14 నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడని తేలడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోరీ సొత్తు వాటాల్లో తేడా రావటంతో స్నేహితులే అతన్ని హత్య చేసి పూడ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు శివారులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లకు చెందిన జంగం చంటిబాబు.. రాయపాటి వెంకన్న ముఠాతో కలిసి కేరళ. తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లోనూ చోరీలకు పాల్పడేవాడు.
చోరీ సొత్తును విక్రయించాలని వెంకన్న చంటిబాబుకు కొంత బంగారం ఇచ్చాడు. బంగారం విక్రయించి నగదు చంటిబాబు స్వంత ఖర్చులకు వినియోగించాడు. తిరిగి ఇమ్మని ఎన్నిసార్లు అడిగినా చంటి లెక్కచేయకపోవటంతో వెంకన్న స్కెచ్ గీశాడు. చంటిబాబును హత్య చేయాలనే పథకంతో తన అనుచరుల ద్వారా విజయవాడ రప్పించాడు. గతేడాది సెప్టెంబర్ 15న విజయవాడలోని ఓ లాడ్జికి స్నేహితులతో కలిసి వచ్చాడు. వాటాలు పంచుకునే విషయంలో చంటిబాబుకు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. చంటిబాబు.. కాళ్లు చేతులు తాళ్లతో కట్టి తీవ్రంగా కొట్టారు. కారులో ఎక్కించుకుని తాడుతో గొంతు నొక్కి చంపారని పోలీసులు తెలిపారు.
'సెటిల్ మెంట్ కోసమని స్నేహితులే చంటి బాబును సెప్టెంబర్ 15న సాయంత్రం తీసుకెళ్లారు. చంటిబాబును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. తమకు రాయపాటి వెంకన్న పై అనుమానం ఉందని పోలీసులకు విన్నవించినా 14 నెలలుగా పట్టించుకోలేదు. ఏడాదికి పైగా మిస్సింగ్ కేసుగానే ఉంచారు.. కనీసం తమ వినతులు కూడా వినలేదు. నిందితుడు వెంకన్న స్థానిక నేతల అండదండలున్నాయి.' - మృతుని భార్య