నల్గొండ జిల్లా మాల్ సమీపంలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన చల్లం బాలకృష్ణ (51), సరస్వతి (42) దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. నగరంలోని వనస్థలిపురం పరిధి ఎఫ్‌సీఐ కాలనీలో సొంతింట్లో ఉంటున్నారు. బాలకృష్ణ నల్గొండ సమీపంలోని బ్రాహ్మణవెళ్లిలో.. సరస్వతి ఎల్బీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు వెంకటరమణ (22), కుమార్తె అక్షిత (15) ఉన్నారు. కాగా బాలకృష్ణది రెండో వివాహం. మొదటి భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. పదిహేనేళ్ల క్రితం సరస్వతిని పెళ్లాడాడు. వెంకటరమణ మొదటి భార్య కుమారుడు.
ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కూడా గొడవ పడ్డారు. అప్పటికే పిల్లలిద్దరూ వేరే గదిలో ఆన్‌లైన్ క్లాసులో ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బెడ్‌రూంలో నుంచి మంటలు చెలరేగాయి. బాలకృష్ణ తన ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వచ్చాడు. సరస్వతి కోసం మళ్లీ లోపలికి వెళ్లగా ఆమె పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో కాపాడలేకపోయాడు. ఈ క్రమంలో బాలకృష్ణ ముఖం, చేతులకు కాలిన గాయాలయ్యాయి. ఇంట్లో నుంచి పెద్దఎత్తున మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.