తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 8:51 AM IST

ETV Bharat / crime

ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ మహిళ హత్య

హైదరాబాద్‌లోని లోకాయుక్త కాలనీలో ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని నిందితుడు కత్తితో పొడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Murder of a woman, Lokayukta Colony in Hyderabad
ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ మహిళ హత్య

ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సైదాబాద్ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకాయుక్త కాలనీలో నివాసం ఉంటున్న మెడికల్ షాప్ వ్యాపారి మంజుల అనే మహిళపై.. ఆగంతుకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని నగర అదనపు కమిషనర్ చౌహాన్ పరిశీలించి.. హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మహిళ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

సైదాబాద్​ లోకాయుక్త కాలనీలో పరిమల్ అగర్వాల్-మంజుల దంపతులు నివసించేవారు. దంపతులిద్దరూ మెడికల్ షాపు వ్యాపారం చేసే వారని ఈస్ట్​జోన్ డీసీపీ రమేష్ తెలిపారు. వ్యాపారం కోసం కొంతమంది నుంచి వారు డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో పరిమల్ అగర్వాల్ గత కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు డీసీపీ వెల్లడించారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిందన్నారు.

ఇదే క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు మంజుల నివాసానికి వచ్చి ఆమెను నిలదీశారు. ఇంటి వద్ద గొడవ చేయొద్దని వారిని అపార్ట్​మెంట్​ కింద మాట్లాడదామని తీసుకెళ్లింది. అదే సమయంలో వారి మధ్య మాటామాటా పెరగడం వల్ల.. ఆగంతుకుడు కత్తితో మంజులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో ఆమె తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని డీసీపీ రమేష్ వివరించారు.

ఇదీ చూడండి :ఆన్‌లైన్‌ వ్యాపారం పేరుతో.. మోసగించి పరారైన మహిళ

ABOUT THE AUTHOR

...view details