తండ్రిని చంపిన వ్యక్తిపై పగపెంచుకున్న అతని కుమారులు మూడేళ్ల తర్వాత దాడిచేశారు. పట్టపగలే నడ్డిరోడ్డుపైనే వేట కొడవళ్లతో పొడిచి చంపారు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంఐఎం నాయకుడు అసద్‌ఖాన్(45), అంజాద్‌ఖాన్ మిత్రులు. తమ స్నేహాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలనుకున్న అసద్ తన కుమార్తెను, స్నేహితుడి కుమారుడికిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. తర్వాత కొంతకాలానికి కూతురు, అల్లుడు మధ్య మనస్పర్థలొచ్చాయి. అమ్మాయి పుట్టింటికొచ్చేసింది. దంపతుల మధ్య గొడవలకు తన మిత్రుడే కారణమని భావించిన అసద్ అతనిపై పగ పెంచుకున్నాడు. 2018లో శాస్త్రిపురంలోని వెల్డింగ్ షాప్‌లో ఒంటరిగా ఉన్న అంజాద్‌ఖాన్‌పై మరో అయిదుగురితో కలిసి దాడిచేశాడు. అత్యంత దారుణంగా సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటనలో అతను అరెస్టయి, జైలుకు వెళ్లాడు. కొంతకాలం క్రితం జైలు నుంచి బయటికొచ్చాడు. అతనిపై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. అప్పట్నుంచి హతుని కుమారులు అదునుకోసం ఎదురుచూస్తున్నారు.
వేట కొడవళ్లు.. 50కి పైగా కత్తిపోట్లు - Old city murder news
16:00 April 01
అందరూ చూస్తుండగానే పట్టపగలు దారుణహత్య
ఆటోతో ఢీకొట్టి..అందరూ చూస్తుండగానే..
ప్రస్తుతం పాతబస్తీ తీగలకుంట అచ్చిరెడ్డినగర్‌లో ఉండే అసద్‌ఖాన్, మిత్రుడు బాబాతో కలిసి గురువారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంలో మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలోని నైస్‌హోటల్ మీదుగా వట్టెపల్లి వైపు వెళ్తున్నాడు. అతివేగంగా ఎదురుగా(రాంగ్‌రూట్) దూసుకొచ్చిన ఆటో వారి బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత ఆటో నుంచి ఆరుగురు వేట కొడవళ్లతో కిందకు దిగారు. బైక్‌పై నుంచి కింద పడిన అసద్‌ఖాన్‌పై వేట కొడవళ్లతో దాడిచేశారు. విచక్షణ రహితంగా పొడిచారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వేట కొడవళ్లను అక్కడే పడేసి పరారయ్యారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మైలార్‌దేవుపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన బాబాను ఆసుపత్రికి తరలించారు. మృతదేహంపై యాభైకి పైగా కత్తిపోట్లు ఉన్నాయని శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. అంజాద్‌ఖాన్ కుమారులే మరికొందరితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
ఇవీ చూడండి:'ప్రేమ పేరుతో పెళ్లి.. ఆ తర్వాత వ్యభిచారానికి ఒత్తిడి!