భారీ వర్షాలు(AP rains update 2021) ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని కొందరు మరణిస్తుంటే.. వరదల(AP floods 2021) వల్ల అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. అనారోగ్య సమస్యతో ఒకవేళ మరణించినా.. చాలా ప్రాంతాల్లో దహనసంస్కారాలు నిర్వహించలేని పరిస్థితులున్నాయి.
కడప జిల్లా(Kadapa rains 2021) చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లె గ్రామంలోని ఇందిరానగర్లో జయమ్మ(70) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు చాలా అవస్థలు పడ్డారు.
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ముఖ్యంగా శ్మశానవాటికకు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతింది. నీళ్లు నిలిచి.. మోకాళ్ల లోతు వరకు దిగబడుతోంది. ఆ మార్గంలో వెళ్లలేని పరిస్థితి.
జయమ్మ మృతదేహానికి దహనసంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులు చివరకు ఓ ఉపాయం కనుగొన్నారు. ట్రాక్టర్ వెనుకభాగాన నాగళ్లు బిగించి... దానిపై మృతదేహాన్ని పెట్టి.. శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అక్కడ శాస్త్రోత్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
వాన పడిన ప్రతిసారి శ్మశానవాటిక దారి ఇలాగే దెబ్బతింటోందని.. ఇలాంటి ఘనటలు జరిగినప్పుడు ఆ మార్గంలో వెళ్లడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్థులు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ రహదారికి మరమ్మతులు చేయించాలని కోరారు.