Mother Suspicious Death: హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మృతదేహం పక్కనే మూడు రోజులుగా ఆమె కుమారుడు జీవనం సాగించాడు. ఈ ఘటన మల్కాజ్‌గిరిలోని విమాలా దేవి నగర్‌లో జరిగింది. కామారెడ్డి జిల్లా లింగంపల్లికి చెందిన 'విజయరాణి - రామ్మోహన్' దంపతుల కుమారుడు వెంకటసాయి బీటెక్ పూర్తి చేశాడు. రామ్మోహన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో చాలా కాలం వీరంతా అక్కడే ఉన్నారు. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో రామ్మోహన్ మృతిచెందటంతో అక్కడి నుంచి వచ్చేసిన తల్లీ కుమారుడు మల్కాజ్‌గిరిలోని విమాలా దేవి నగర్‌లో నివాసముంటున్నారు. సొంతూళ్లో పొలాలు, ఇంటి అద్దెలతో వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. అప్పటి వరకు అందరితో ఎంతో స్నేహంగా ఉండే వెంకటసాయి తండ్రి మృతితో మానసికంగా కుంగిపోయాడు.
ఈ క్రమంలోనే ఒంటరిగా ఉంటూ తల్లితోనూ గొడవ పడుతుండేవాడు. అయితే.. గత నాలుగైదు రోజులుగా తల్లీ కొడుకు బయటకు రాకపోవడం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న పోలీసులు ఎంత పిలిచినా ప్రయోజనం లేకపోవటంతో, నెట్టుకుని లోనికి వెళ్లి చూశారు. ఓ గదిలో కుళ్లిపోయిన స్థితిలో విజయరాణి మృతదేహం పడిఉండగా మరో గదిలో ఆమె కుమారుడు వెంకటసాయి తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. మూడ్రోజులుగా ఆహారం తీసుకోకుండా... నీరసించిన వెంకటసాయికి భోజనం పెట్టారు. విజయరాణి.. మూడ్రోజుల క్రితమే మృతి చెందినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు.. వెంకటసాయి మానసిక స్థితి సరిగా లేనట్లు గుర్తించారు.