Mahaboobnagar Suicide: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో విషాదం చోటు చేసుకుంది. 9 నెలల కుమార్తెతో సహా చెరువులో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరితకు.. మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల కిందట వివాహమైంది. వారికి తొమ్మిదినెలల కుమార్తె కూడా ఉంది.
అయ్యో ఏం కష్టమొచ్చిందో.. కుమార్తెను నడుముకు కట్టుకుని తల్లి ఆత్మహత్య! - Mahaboobnagar Suicide latest news
10:19 December 02
9 నెలల కుమార్తెతో సహా చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
కుటుంబకలహాలతో సరిత కుమార్తెను తీసుకుని.. నవంబర్ 30వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి కుటుంబసభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో డిసెంబర్ 1వ తేదీన కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ రోజు ఉదయం సరిత ఇంటి సమీపంలోని చెరువులో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీశారు. సరిత ఆత్మహత్య చేసుకునే ముందు తన చీరతో పాపను కడుపునకు కట్టుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి:Wife Kidnap: భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. ఎందుకంటే?