మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని... భగత్‌సింగ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేత సంబంధానికి అడ్డు వస్తున్నాడని... కన్న కొడుకునే ఓ తల్లి కొట్టి చంపింది. జగద్గిరిగుట్టకు చెందిన సురేష్‌కు... ఉదయతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఉమేష్ అనే కుమారుడు ఉన్నాడు. భాస్కర్ అనే మేస్త్రీ వద్ద సురేష్ పనికి వెళ్తుండేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో భాస్కర్‌తో ఉదయ సాన్నిహిత్యంగా మెలిగేది. గమనించిన భర్త... పలుమార్లు హెచ్చరించాడు. కొన్ని రోజులకు కుమారుడు ఉమేష్(3)ను తీసుకుని భాస్కర్‌తో కలిసి వెళ్ళిపోయింది. కుమారునితో కలిసి రెండేళ్లుగా భగత్‌సింగ్‌నగర్‌లో ఉదయ నివాసముంటోంది.
కన్నతల్లి కర్కశత్వం.. కుమారున్ని కొట్టి చంపిన వైనం - జీడిమెట్లలో దారుణం
ప్రాణం పోసిన అమ్మే ఆ పిల్లాడి పాలిట కర్కశంగా మారింది. భర్త మీది కోపమే కొడుకుకు తల్లి విసిరిన యమపాశమైంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనో... కుమారుని వంకతో భర్త పదేపదే తన ఇంటికి వస్తున్నాడనో.. తన కోపాన్నంతా చిన్నారిపై చూపించింది. లాలించి గోరు ముద్దలు పెట్టిన చేతులతోనే... ఉక్రోషంతో ఇష్టమొచ్చినట్టు కొట్టింది. జీవం పోసిన అమ్మే.. జీవశ్చవమయ్యేలా కొడుతుంటే.. ఆ పిల్లాడు తట్టుకోలేక శ్వాస విడిచాడు.
తన కుమారుడిని చూడడానికి పలుమార్లు సురేష్... జగద్గిరిగుట్ట నుంచి భగత్‌సింగ్‌నగర్‌కు వచ్చేవాడు. కుమారుని కారణంగా సురేష్ పదే పదే తన ఇంటికి వస్తున్నాడన్న కోపంతో పిల్లాడిని కర్రతో తీవ్రంగా కొట్టింది. దెబ్బలు తట్టుకోలేక స్పృహ కోల్పోయిన బాలున్ని... పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి చివరకు సురారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే... తన కుమారుణ్ని చంపేశారని భర్త సురేష్ ఆరోపించాడు. ఉదయను పలు మార్లు ఇంటికి రావాలని అడిగినా... పట్టించుకోలేదని వాపోయాడు.