Extra Marital Affair in Khammam : సొంత మామ(భర్త తండ్రి)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆ మహిళ. వాళ్లిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో కుమార్తె చూసింది. అది తెలుసుకున్న వాళ్లు.. ఆమెను అడ్డుతొలగించుకునేందుకు వ్యూహం పన్నారు. ఎలాగోలా ఆ పసిపాపను హతమార్చి.. సహజ మరణంగా చిత్రీకరించేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. కానీ ఆమె మెడపై రాపిడి ఉండటం గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మామా కోడళ్లను విచారించగా.. మరో ట్విస్ట్ బయటపడింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లులో చోటుచేసుకుంది.
Mother Killed daughter in Khammam : వైరా ఏసీపీ స్నేహా మెహ్రా తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు కుమారుడికి సునీతతో వివాహమైంది. సునీతకు 12 ఏళ్ల పాప ఉంది. కొంతకాలంగా ఈమె మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వీరు ఏకాంతంగా ఉన్నప్పుడు బాలిక చూడటంతో మామతో కలిసి కన్న కూతురినే హతమార్చింది. ఈనెల 9న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి చంపారు. దీన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ముందుగా బాలిక ఫిట్స్ వచ్చి కింద పడటంతో దెబ్బ తగిలిందని మృతదేహాన్ని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించుకొన్నారు. పీహెచ్‌సీలో చనిపోయినట్లు నిర్ధారించకూడదని.. ‘వెంటనే ఖమ్మం తీసుకెళ్లమని’ పంపించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు పాప చనిపోయిందని నిర్ధారించారు. తల్లి, తాత బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఇవ్వాలని కోరారు. చిన్నారి మెడపై రాపిడి గుర్తులు ఉండటంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.