తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2022, 9:16 PM IST

ETV Bharat / crime

నీడ కోసం వేసిన రేకులషెడ్డు.. తల్లీకూతుళ్ల నిండు ప్రాణాలు తీసుకుంది..

Mother and Doughter Died: ఇంటి ముందు రేకుల షెడ్డు వేసుకోవటమే వాళ్ల పొరపాటా..? పిల్లలకు గాలి కోసం ఫ్యాన్​ బిగించటమే ఆ కుటుంబం చేసిన తప్పా..? ఈరోజు పాఠశాల లేకపోవటమే కొంపముంచిందా..? తప్పెవరిదైనా.. దాని ఖరీదు మాత్రం తల్లీకూతురి ప్రాణాలు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Mother and Doughter Died with current shock in khadlapur
Mother and Doughter Died with current shock in khadlapur

Mother and Doughter Died: ఇంటి ముందు నీడ ఉంటుందని వేసిన రేకుల షెడ్డు ఆ ఇంట్లో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. విద్యుదాఘాతంతో తల్లితో పాటు ఐదేళ్ల చిన్నారి మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఖాడ్లపూర్​లో జరిగింది. గ్రామానికి చెందిన తుకారం, అంకిత దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా.. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. తమ ఐదేళ్ల కుమార్తె అక్షర ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ఈరోజు ఓ విద్యార్థి సంఘం బంద్​కు పిలుపునివ్వడంతో పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. చిన్నారి అక్షర.. నాలుగేళ్ల చెల్లితో ఇంటి వద్దనే ఆడుకుంటోంది.

అయితే.. అక్షర వాళ్లది గూనఇల్లు. నీడ కోసమని ఇంటి ముందు రేకుల షెడ్డు వేసుకున్నారు. రేకుల కిందే ఎక్కువ సమయం గడుపుతుండటం వల్ల ఫ్యాన్ కూడా బిగించుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చింది. ఫ్యాన్​ కోసం ఇంట్లో నుంచి తీసుకొచ్చిన విద్యుత్​ వైర్​.. ఎక్కడో తెగి ఇనుప రేకులకు తగిలినట్టుంది. ఫ్యాన్​ వేసి ఉండటంతో.. విద్యుత్ రేకులతో పాటు రాడ్​లకు ప్రవహించింది. అది తెలియని చిన్నారి అక్షర.. అదే సమయంలో ఆడుకుంటూ వచ్చి ఇనుప రాడ్​ను పట్టుకుంది. ఒక్కసారిగా షాక్​కొట్టటంతో.. అమ్మా.. అమ్మా.. అని అరిచింది. కూతురికి ఏమైందోనన్న కంగారులో.. కాపాడేందుకు ప్రయత్నించింది. షాక్​ వచ్చిందన్న విషయం తెలియకపోవటంతో.. తల్లికి కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. వాళ్లు విగతజీవులైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఈ విషాదం జరిగిన కొన్ని క్షణాలకే భర్త తుకారాం ఇంటికి వచ్చాడు. భార్య, కూతురు పడిపోయి ఉన్నారని లేపేందుకు ప్రయత్నించగా.. చనిపోయారన్న చేదు నిజం తెలిసింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఆడుకున్న కూతురు, తన కష్టసుఖాల్లో తోడున్న భార్య విగతజీవులుగా మారడాన్ని చూసి తుకారం గుండెలవిసేలా రోధించాడు. వీళ్లకు కొంత దూరంలోనే నాలుగేళ్ల రెండో కుమార్తె కూడా ఆడుకుంటోంది. విద్యుత్​ సరఫరా నిలిచిపోకుండా ఉంటే.. తండ్రితోపాటు చిన్న కూతురు కూడా మృత్యువాత పడేదని స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details