సుపారీ కిల్లర్స్‌తో చేతులు కలిపి అత్త, భార్యను హతమార్చాడు.. మంచిర్యాలలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 18న పట్టణంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో విజయలక్ష్మి, ఆమె కూతురు రవీనా దారుణంగా హత్యకు గురయ్యారు. అత్యంత పాశవికంగా ఉరి బిగించి హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యం దొరకకుండా పకడ్బందీగా ఘాతుకానికి పాల్పడిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్నట్టు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. నిందితులు అల్లుడు అరుణ్ కుమార్‌తో పాటు గుంటూరు జిల్లాకు చెందిన జుజ్జవరపు రోశయ్య అలియాస్ బిట్టు, కృష్ణా జిల్లాకు చెందిన దండం సుబ్బారావు అనే కిరాయి హంతకులుగా గుర్తించినట్టు సీపీ వెల్లడించారు.
కేసు పెట్టారనే కోపంతోనే..
ఫేస్బుక్ ద్వారా రవినాకు అరుణ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. 2019 జూన్‌లో వివాహం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని రోజుల తర్వాత.. రవినాను వరకట్నం కోసం అరుణ్ వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేక మంచిర్యాలలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న అరుణ్ తన అత్త, భార్యను అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు.
సుపారీ గ్యాంగ్ సాయంతో...
సామాజిక మాధ్యమంలో గన్‌కల్చర్ ప్రోగ్రామ్స్ ద్వారా సుపారీ కిల్లర్స్ విజయవాడ సైట్‌ను ఆశ్రయించాడు. తన అత్త, భార్యను చంపాలని సాయం అడిగాడు. బిట్టు గుంటూరు అని పరిచయం చేసుకున్న సైట్ నిర్వాహకుడు... రూ.10 లక్షల సుపారీ కావాలని అడిగారు. తన వద్ద డబ్బులు లేవని... అత్తింట్లో 20 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు... ఉన్నాయని నమ్మించాడు. హత్యకు ప్రణాళిక వేసేందుకు మంచిర్యాలకు పిలిపించాడు. పథకం ప్రకారం.. ఈ నెల 18న ఉదయం నాలుగు గంటలకు అరుణ్, బిట్టు, సుబ్బుతో కలిసి విజయలక్ష్మి, రవీనాను తాడుతో ఉరి బిగించి చంపేశారు.
టెక్నాలజీతోనే...
"ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు చరవాణిలో ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని.. కాల్స్ చేశారు. ఎలాంటి సాక్షాధారాలు దొరకుండా జాగ్రత్తపడ్డారు. టెక్నాలజీని వాడుకొని ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే.. ఇప్పుడు అదే టెక్నాలజీ ఉరితాడై బిగుసుకుంది. అన్ని రకాల సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్న ఆధారాలతో నిందితులకు కఠిన శిక్షపడటం ఖాయం. నిందితులు ఎంత సాంకేతికత వాడి నేరాలు చేస్తారో... అంతే టెక్నాలజీ వాడి వాళ్లను మేం పట్టుకుంటాం. సామాజిక మాధ్యమాలలో అనామకులతో అమ్మాయిలు ప్రేమలో పడి... చివరకు తమ ప్రాణాలే కాకుండా కన్నవారి ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఇలాంటి వాటి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి."- సీపీ సత్యనారాయణ
హత్యకు సంబంధించి.. నిందితులు వాడిన సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చేధించేందుకు కృషి చేసిన సిబ్బందిని డీసీపీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్ అభినందించారు.
ఇవీ చూడండి: