ఏపీలోని గుంటూరు మెడికల్ క్లబ్ పీకల వాగు వద్ద ఆడుకుంటూ కాల్వలో పడి గల్లంతైన బాలుడు వెంకటేష్ (5).. మరణించాడు. సంపత్ నగర్ వద్ద కాలువలోకి బాలుడి మృతదేహం కొట్టుకొచ్చింది.
ఉదయం 10 గంటల సమయంలో బాలుడి మృతదేహం లభించినట్లు రుద్రా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు సుభాని తెలిపారు. అర్ధరాత్రి వరకు జోరు వానలో వెతికినా.. ఆచూకీ దొరకలేదని, తెల్లవారుజాము నుంచి చేసిన ప్రయత్నంతో మృతదేహం లభించిందని చెప్పారు.
నిన్నటి దాకా కళ్లముందే ఆడుకుంటూ ఆనందంగా గడిపిన తమ కుమారుడు.. విగతజీవిగా కనిపించడంతో బాలుడి తల్లి మంగమ్మ కన్నీటి పర్యంతమైంది.
అసలేమైందంటే..
శనివారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. శివరాంనగర్లో నివసించే పుల్లయ్త, మంగమ్మల రెండో కుమారుడు వెంకటేష్..ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. వరద నీటి ధాటికి బాలుడు కొట్టుకుపోవడంతో.. ఆచూకీ కోసం ఎన్టీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినా..ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున సంపత్ నగర్ వద్ద బాలుడు మృతదేహం బయటపడింది.
సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబం కన్నీటిపర్యంతం అవుతోంది.
నిన్న గల్లంతు.. నేడు కాల్వలో బాలుడి మృతదేహం! ఇదీచూడండి:Accident: రెండు బస్సుల మధ్యలో నలిగి వ్యక్తి మృతి