Mirchi Farmers Protest At Enumamula Market: వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి పంటకు ధర తగ్గించడం వల్ల రైతులు భగ్గుమన్నారు. ఎంతో కష్టపడి పంటను తీసుకువస్తే తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీజన్ ప్రారంభంలో రూ. 18 వేల 600 పలికిన ధరను.. రూ. 17 వేల 200కు తగ్గించారని ఆరోపించారు. నాణ్యత పేరుతో జెండా పాటకన్నా తక్కువకు కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం...
మార్కెట్‌లో ఉన్నపలంగా మిర్చి రేటు తగ్గించటం వల్ల అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిర్ణయించిన ధర కంటే రూ. 2 వేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులతో చర్చలు జరిపారు. ధరలు సవరించాలని అధికారులు ఆదేశించారు. అయినా పట్టించుకోకుండా కాంటాలు నిర్వహించడం వల్ల ఉద్రిక్తత ఏర్పడింది. రైతులు కాంటాలను ధ్వంసం చేశారు. తూకం పూర్తైన బస్తాలను ట్రాక్టర్ల మీద నుంచి పడేశారు. మార్కెట్లోని డీసీఎంను ధ్వంసం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని నినదించారు.
'మొన్న రాళ్ల వాన వచ్చి... పంట మొత్తం పోయింది. ఏదో మిగిలింది అమ్మితే... ధర మొత్తం తగ్గించేశారు. పెట్టుబడి పెట్టాం... సగం కూడా వచ్చేట్టు లేదు. రైతులను మోసం చేస్తున్నారు ఈ దళారులు.'
- మిర్చి రైతు