మైనర్ బాలికపై అత్యాచారం.. ఇంట్లో అద్దెకుండే వాడి పనే! - minor girl rape in Hyderabad
12:30 June 08
మైనర్ బాలికపై అత్యాచారం.. ఇంట్లో అద్దెకుండే వాడి పనే!
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ అనంతరం రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజులోనే ఏడుగురు బాలికల జీవితాలు కామాంధుల చేతిలో నలిగిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ నారాయణపేట జిల్లాలో ఇంట్లో ఎవరూ లేనిసమయం చూసి ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయగా ఆమె గర్భందాల్చిన సంఘటన బయటకు వచ్చింది. బయటకు రాకుండా కాలగర్భంలో కలిసిపోతున్న ఇలాంటి ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో తన ఇంట్లో అద్దెకుండే యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో ఎల్లేశ్ అనే యువకుడు ఓ ఇంట్లో అద్దెకు చేరాడు. ఆ ఇంట్లో భార్యాభర్తలు, పదో తరగతి చదువుతున్న వారి కుమార్తె ఉంటున్నారు. నెమ్మదిగా ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు ఎల్లేశ్. మంచివాడేనని ఆ కుటుంబం అతణ్ని నమ్మింది. అకస్మాత్తుగా ఈనెల 1న ఇంట్లో నుంచి ఆ బాలిక అదృశ్యమైంది. ఆ తర్వాత ఎల్లేశ్ కూడా కనిపించకుండా పోయాడు. అనుమానమొచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఇవాళ ఆ బాలిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై ఎల్లేశ్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.