Girl Suicide due to harassments: వివాహితుడి వేధింపులు తాళలేక ఓ బాలిక తనువు చాలించిన ఘటన.. నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లయి పిల్లలున్న ఆ కీచకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ బాలిక వెంటపడి వేధింపులకు గురిచేయడంతో ఓపిక నశించి మరణమే శరణ్యమనుకుంది. దామరచర్ల మండల పరిధికి చెందిన ఓ మైనర్.. ఈనెల 24 న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
భూక్య కృష్ణ అనే వ్యక్తి వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఆరోపించారు. వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవాలని తన కుమార్తె వెంటపడ్డాడని తండ్రి, కుటుంబీకులు ఆరోపించారు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు వివరించారు. విషయం తెలిసి తాము కృష్ణను మందలించామని.. పెద్ద మనుషుల్లో పంచాయితీ కూడా పెట్టామని చెప్పారు.