Audio Viral: ఇప్పుడే ఏసీపీతో మాట్లాడా.. స్టేషన్ బెయిల్ ఇప్పిస్తా.. ఏం కాదు మీరు స్టేషన్‌కి వెళ్లి కలవండి.. మంత్రి పీఏ మల్లికార్జున్ సార్ చెప్పాడని చెప్పండి’... ‘కొంత డబ్బులు ఖర్చవుతాయి. ఏసీపీ, సీఐలకు అడ్జస్ట్ చేయాలి. డబ్బులు మాత్రం తక్షణమే కావాలి. ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు. చెప్తే పోలీసులు బద్నామ్ అవుతారు. ఎంత మొత్తమనేది నేను చెప్తా’ అంటూ ఓ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు మంత్రి పీఏ పేరిట డబ్బులు డిమాండ్ చేసిన ఆడియో వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Audio Viral: 'ఏసీపీ, సీఐలకు డబ్బులు అడ్జస్ట్ చేయాలి'
Audio Viral: ఓ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు మంత్రి పీఏ పేరిట ఓవ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడు. అతడు మాట్లాడిన ఆడియో సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
కరీంనగర్ నగరంలో గత నెల 17న పోలీసులు అనుమతులు లేని తాగునీటి శుద్ధి కేంద్రాలను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్నింటిపై కేసులు నమోదు చేశారు. ఇలా కేసు నమోదైన ఓ బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించే విషయమై అతనితో మంత్రి పీఏనంటూ చెప్పుకున్న వ్యక్తి మాట్లాడిన 3.53 నిమిషాల నిడివి గల రెండు ఆడియో సంభాషణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై సంబంధిత మంత్రి గంగుల కమలాకర్ వివరణ ఇచ్చారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు పీఆర్‌వో ఆడియోలో తన పీఏగా చెప్పుకొన్న వ్యక్తిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.
మరోపక్క ఈ వ్యవహారంలో పోలీసుల ప్రస్తావన అందులో ఉన్నందున అదనపు డీజీపీ, ఇన్‌ఛార్జి ఐజీ నాగిరెడ్డి జిల్లా పోలీసుల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. ఈ ఆడియో సంభాషణలో పోలీసుల పేర్లను ప్రస్తావించడం పట్ల కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణను వివరణ ఇచ్చారు. అదనపు డీసీపీ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణ చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు.