Medical student suicide : స్నేహితులు మాట్లాడటం లేదని వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల మేరకు.. న్యూఫ్రెండ్స్‌కాలనీలో నివసించే సెల్వన్, చిత్ర దంపతుల ఏకైక కుమార్తె వినీష(20). తమిళనాడుకు చెందిన వారు ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. ప్రస్తుతం సెల్వన్ దంపతులు స్థానికంగా ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు.
ఏం జరిగింది?
Rajendra nagar suicide case : వినీష.. మొయినాబాద్‌లోని ఓ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని. ఆమె చదువుకు ఇబ్బంది కలగకుండా నివాస ప్రాంగణంలోనే ప్రత్యేక గదిని సైతం కుటుంబసభ్యులు నిర్మించారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు విధులకు వెళ్లే సమయానికి వినీష గది తలుపులు తెరవలేదు. ఆలస్యంగా నిద్ర లేస్తుందేమోనని వారు వెళ్లిపోయారు. అనంతరం పలుసార్లు కుమార్తెకు ఫోన్ చేసినా కలవలేదు. సాయంత్రం 5గంటలకు తిరిగొచ్చిచూసినా, గది తలుపులు మూసే ఉన్నాయి. అనుమానంతో కిటికి నుంచి చూడగా.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిన తల్లిదండ్రులు.. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.