Mastermind of the drugs Edwin is on the run: గోవా మాదక ద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న ఎడ్విన్ కోసం హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు గాలిస్తున్నారు. గోవా నుంచి తప్పించుకున్న ఎడ్విన్ బెంగళూరు లేదా ముంబయిలో తలదాచుకొని ఉండొచ్చని నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. మాదక ద్రవ్యాల కేసులో ఎడ్విన్ నిందితుడిగా ఉన్నాడు. రెండు నెలల క్రితం గోవా పోలీసులు ఎడ్విన్‌ను ఓ కేసులో అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు గోవా జైల్లో ఉన్న ఎడ్విన్ ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ ఎడ్విన్‌పై మాదక ద్రవ్యాల కేసు ఉండటంతో నార్కోటిక్ పోలీసులు, ఈ విషయాన్ని గోవా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎడ్విన్‌ను అప్పజెప్పాలని కోరగా ఆ మేరకు గోవా పోలీసులు ఎడ్విన్‌కు నోటీసులు జారీ చేశారు.
కరోనా వచ్చి అనారోగ్యం బారిన పడ్డానని పోలీస్ స్టేషన్‌కు రాలేనని ఎడ్విన్ గోవా పోలీసులకు సమాధానం ఇచ్చాడు. ఈ మేరకు కరోనా సోకినట్లు ఓ ధ్రువీకరణ పత్రాన్ని పోలీసులకు పంపించాడు. ఆ కరోనా రిపోర్ట్‌ను నార్కోటిక్ పోలీసులకు పంపించారు. అనుమానం వచ్చిన నార్కోటిక్ పోలీసులు ఎడ్విన్ కరోనా రిపోర్టును పరిశీలించారు. అది నకిలీ కరోనా రిపోర్టుగా తేల్చి, ఇదే విషయాన్ని గోవా పోలీసులకు చెప్పారు. ఈ విషయంపై గోవా పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.