వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, మండలంలో దుండగులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే బుధవారం రాత్రి మరో దొంగతనానికి పాల్పడుతుండగా పరిగి పోలీసులు నేరుగా పట్టుకున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చిన ఆరుగురిలో ముగ్గురిని పట్టుకోగా.. పరారైన మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారు.
సాయంత్రం పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి.. రాత్రిపూట దొంగతనాలకు పాల్పడేవారని సీఐ లక్ష్మీ రెడ్డి తెలిపారు. వారిని పట్టుకునేందుకు ఓ టీంను తయారుచేసి ప్రణాళిక ప్రకారం పట్టుకున్నామన్నారు.
భారీ దొంగతనాలు..
పరిగి మండలం, వికారాబాద్ జిల్లాలోని ఏడు పోలీస్టేషన్ల పరిధిలో భారీ దొంగతనాలకు పాల్పడ్డారు. వారి నుంచి 17 తులాల వెండి, 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు గోవాలోనూ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మరో 9 తులాల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువ పెట్టారని.. వాటి రసీదులను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వీరంతా మొయినాబాద్‌కు చెందిన వారిగా గుర్తించామన్నారు.
ఇదీ చూడండి:చోరీలు, అత్యాచారాలకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్: సీపీ