married women suicide: భర్త అన్నే కదా అని అవసరానికి చేయి చాపితే.. అదే ఆసరాగా చేసుకుని వేధించాడు. చెప్పినట్టు వినకపోతే అందరిలో పరువు తీస్తానని భయపెట్టాడు. బెదిరింపులకు భయపడి భర్తకు అన్యాయం చేయలేక.. పరువుపోతుందన్న భయంతో బయటికి చెప్పలేక.. బలవన్మరణం చేసుకుంది ఓ 45 ఏళ్ల వివాహిత. బావ పెట్టిన వేధింపులు వివరిస్తూ.. ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొగాకులపల్లికి చెందిన ముంజం అరుణ తన భర్త రాజుతో కలిసి కాపువాడలో నివాసముంటోంది. భర్త రాజు ఆర్టీసీలో ఒప్పంద డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అరుణ టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. ఒకతను భార్యతో పాటు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ఇంకో కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
భర్త లేనప్పుడు ఇంటికొచ్చి..
sexual harassment: లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు రావటం వల్ల.. తన భర్తకు అన్న అయిన ముంజం కనకయ్య వద్ద పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తీసుకుంది పదివేలైతే.. 30 వేలు ఇచ్చానంటూ కనకయ్య చిత్రీకరిస్తున్నాడని సెల్పీ వీడియోలో తెలిపింది. డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడే వాడని వీడియోలో అరుణ కన్నీటి పర్యంతమైంది. తన భర్త ఇంట్లో లేనప్పుడు వచ్చి లైంగికంగా వేధించేవాడని వాపోయింది. పదేపదే ఫోన్ చేసి వేధించేవాడని.. తాను చెప్పినట్లు వినకపోతే అందరిలో పరువు తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది.
సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోలో..
selfie video viral: "లాక్డౌన్ సమయంలో ముంజం కనకయ్య దగ్గర 10 వేలు తీసుకున్నాం. కానీ.. 30 వేలు ఇచ్చానని అబద్దం చెప్తున్నాడు. డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. లేకపోతే తాను చెప్పినట్టు వినాలని.. వేధిస్తున్నాడు. నా భర్త లేనప్పుడు ఇంటికి వచ్చి లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. నేను మంచిదాన్ని కాదని అందరికి ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడు. నేను భరించలేకపోతున్నా. పోలీసులకు చెప్తే మా కుటుంబం బజారులో పడ్తుంది. ఇన్ని రోజులు గుట్టుగా ఉన్న సంసారాన్ని బజార్లో పెట్టలేక.. వేధింపులు భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్నా. సోనూ.. నిన్ను కోడలిలా కాకుండా కూతురిలా చూసుకున్నా. ఇకపై నిన్ను చూసుకోలేను. అందరు మంచిగా ఉండండి. ఎవరినీ నమ్మకండి. నమ్మితే మనల్నే ముంచేస్తారు." - అరుణ, మృతురాలు
బావ బెదిరింపులకు లొంగి తన భర్తకు అన్యాయం చేయలేనని.. బావ ఎంత వేధించినా ఓర్చుకుంది. ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబ పరువు పోతుందని ఆలోచించి వెనకడుగు వేసింది. అటు వేధింపులు.. ఇటు పరువు మధ్యలో నలిగిపోయింది. తీవ్ర మనోవేదనను తట్టుకోలేక ఓ బలహీనక్షణంలో చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: