నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పదర మండలం మద్దిమడుగు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ వివాహిత, యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరనానికి పాల్పడ్డారు.
యువకుడితో సహా వివాహిత ఆత్మహత్య.. పక్కనే ఏడుస్తూ బాలుడు.. - lovers suicide news
20:12 July 03
యువకుడితో సహా వివాహిత ఆత్మహత్య.. పక్కనే ఏడుస్తూ బాలుడు..
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(30) అదే గ్రామానికి చెందిన యువతి (28) ప్రేమించుకున్నారు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆ యువతికి ఏడేళ్ల కిందట హైదరాబాదుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమారులు. అయినా యువతీయువకుల మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కుమారుడితో కలిసి యువతి, యువకుడు పది రోజుల కిందట వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. రెండు కుటుంబాల వారు వీరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వారిద్దరూ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగుకు చేరుకున్నారు.
గ్రామంలోని ఆలయానికి అర కిలోమీటరు దూరంలో వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి చెప్పారు. రెండు కుటుంబాల వారు మద్దిమడుగుకు చేరుకొని గాలింపు చేపట్టారు. ఆలయ సమీపంలోని చెట్ల మధ్య వెదుకుతుండగా యువతి కుమారుడి ఏడుపును విని అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ విగత జీవులై పడి ఉన్నారు. గ్రామస్థులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అమ్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:CRIME: అనుమానంతో చంపి.. కరోనాను వాడుకుని.. చివరికి...