Child Marriage: వారిది నిరుపేద కుటుంబం.. కాలానికి అనుగుణంగా సంచార జీవితం గడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి వారి జీవితంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, సంబురాలు అంటే వారికే కాదు.. వారి కడుపున పుట్టిన పిల్లలకూ వింతే. ఏ నెల ఏ ఊళ్లో ఉంటామో తెలియని కుటుంబంలో పుట్టిన ఆ బాలికకు.. పుట్టిన రోజు అనేది తీరని కలే. అయినా అమ్మానాన్నలను గౌరవిస్తూ వారికి ప్రతి పనిలోనూ సహాయముండేది. ఇలా జరుగుతుండగా ఓ రోజు తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి.. 'కొద్ది రోజుల్లో నీ పుట్టినరోజు.. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుందాం' అన్నారు. అంతే ఆ బాలిక ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత ఎగిరి గంతేసింది.
ఇక అప్పటి నుంచి ఇంట్లో హడావుడి మొదలైంది. ముందు నుంచే పండుగ వాతావరణం మొదలైంది. ఇంటికి ఎవరెవరో చుట్టాలొస్తున్నారు. కొత్త చీరలు ఇంట్లో తిష్ట వేశాయి. ఇదంతా చూసి ఆ చిన్నారి అవాక్కయినా.. పుట్టిన రోజు పెద్దగా చేస్తున్నారేమో అని సంబురపడింది. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఇంట్లో ఇంకా సందడి మొదలైంది. దీంతో ఆ చిన్నారి కేక్ కోసం చూసింది. కనపడలేదు. సర్‌ప్రైజ్ ఇస్తారేమో అనుకుంది. కానీ ఇంట్లో వాళ్లు తనకు చీర కట్టి ముస్తాబు చేస్తున్నారు. ఇదంతా ఏంటో తనకు అర్థం కాలేదు. అద్దంలో చూసుకుంటే తనకు తాను పెళ్లి కూతురిలా కనిపించింది. అనంతరం బయటకు తీసుకెళ్లి.. ఓ వేదిక మీదకు తీసుకెళ్లి ఓ వ్యక్తి పక్కన కూర్చోబెట్టారు. అతన్ని ఒకసారి చూసింది. తనకంటే మూడు రెట్ల వయసు ఎక్కువ ఉండొచ్చు. అతనూ పెళ్లి కొడుకులా ముస్తాబై ఉన్నాడు. చూస్తే పెళ్లి వేదికలా ఉంది. అప్పుడప్పుడూ తను బంధువుల శుభకార్యాలకు వెళ్లినప్పుడు చూసే వేదికలా ఉంది.
అప్పుడు కానీ ఆ అమాయకురాలికి అర్థం కాలేదు.. తనకు చేస్తుంది పుట్టిన రోజు కాదు.. పెళ్లి అనీ.. అంతే ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి ఈ పెళ్లి వద్దని అరిచింది. తన వాళ్లను బతిమిలాడింది. 'నాకు ఈ పెళ్లి వద్దంది'.. అయినా వాళ్లు వినలేదు. బలవంతంగా ఆ మూడున్నర పదుల వ్యక్తితో ఆ చిన్నారికి ముడి పెట్టేశారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి జీవితాన్ని అంధకారం చేశారు. దేశంలో బాల్య వివాహాల పట్ల నిషేధం ఉన్నా.. అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరగడం కొందరు తల్లిదండ్రుల ఆలోచనాధోరణికి నిలువుటద్దం.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో ఈ దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికకు పెళ్లి చేశారు. వివాహం జరిగిన మరుసటి రోజు తన ఇంటికి వచ్చిన బాలిక గ్రామ సర్పంచ్ వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పింది. సర్పంచ్, మరికొందరు గ్రామస్థులు కలిసి ఈ విషయాన్ని ఐసీడీఎస్ సిబ్బందికి తెలిపారు. ఐసీడీఎస్ సిబ్బంది గ్రామాన్ని సందర్శించి విషయం గురించి తెలుసుకున్నారు. తమ వెంట బాలికను తీసుకెళ్లారు.