ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల యువకులు, విద్యార్థులే లక్ష్యంగా కొన్నేళ్లుగా .. గంజాయి, ఇతర మత్తుపదార్థాల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వివిధ మార్గాల్లో అక్రమంగా వస్తున్న గంజాయి రెండు జిల్లాలను ముంచెత్తుతోంది. పోలీసులు దాడులు చేస్తున్నా చీకటి వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు గుంటూరు అర్బన్ జిల్లాలో 45 మాదక ద్రవ్య కేసులు నమోదయ్యాయి.
గుంటూరులో గుప్పుమంటున్న గంజాయి.. - గుంటూరు జిల్లాలో పెరిగిన గంజాయి అమ్మకాలు
ఏపీలోని గుంటూరులో గంజాయి గుప్పుమంటుంది. ఆరండేల్ పేట, పాత గుంటూరు, నగరంపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయం.. చాపకింద నీరులా విస్తరించింది. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు సాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. సూత్రధారులను గుర్తించే పనిలో పడ్డారు.
ఈ కేసుల్లో 155 మందిని అరెస్ట్ చేశారు. 293 కిలోల గంజాయి, 415 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గుంటూరులోని ఆరండేల్ పేట, నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన తనిఖీల్లో 8మంది గంజాయి విక్రయదారులను పోలీసులు ఆరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సాధారణ గంజాయితో పాటు 10 గ్రాముల బరువుండే చిన్న డబ్బాల్లోని ద్రవ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా వేర్వేరు మార్గాల్లో.. వేర్వేరు రూపాల్లో గంజాయి సరఫరా సాగుతూనే ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని ద్రవరూపంలో మార్చి పుస్తకాలు, జేబుల్లోనూ తీసుకెళ్తున్నారు.
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కారణంగా.. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్ దెబ్బతింటోదని పోలీసులు చెబుతున్నారు. కళాశాలల్లో గొడవలకు మత్తుపదార్థాల వాడకం కారణమవుతుందని గుర్తించిన పోలీసులు.. వీటి వాడకం, విక్రయాలు అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల యాజమాన్య ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ కమిటీలు వేస్తున్నారు.