మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావును విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వివాహితపై అత్యాచారం, అపహరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగేశ్వర్‌రావును వనస్థలిపురం పోలీసులు 3 నెలల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దృష్టికి వనస్థలిపురం పోలీసులు తీసుకెళ్లారు. దీంతో సీవీ ఆనంద్ వెంటనే నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేశారు. నాగేశ్వర్ రావు రెండున్నర నెలలకు పైగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రెండుసార్లు ఎల్బీనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ తిరస్కరణకు గురైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన నాగేశ్వర్‌రావుకు సెప్టెంబర్ 28న షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో నాగేశ్వర్‌రావు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు.
పోలీస్ ఉన్నతాధికారులు నాగేశ్వర్‌రావుపై నమోదైన కేసును తీవ్రంగా పరిగణించారు. అన్యాయం జరిగిన వాళ్లకు తగిన న్యాయం చేయాల్సిన పోలీసులే.. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు నాగేశ్వర్‌రావును విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
10 నెలల కాలం.. 55 మందిపై చర్యలు..: సీవీ ఆనంద్ గతేడాది డిసెంబర్ 25న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 55 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన లాలాగూడ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కట్నం కోసం భార్యను వేధించిన రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్‌తో పాటు మరో 53 మందిని సర్వీస్ నుంచి ఇది వరకే తొలగించారు. నాగేశ్వర్ రావును డిస్మిస్ చేసిన సందర్భంగా ఈ 10 నెలల కాలంలో మిగతా వాళ్లపై తీసుకున్న చర్యల గురించి కూడా సీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
నాగేశ్వరరావు కేసు పూర్వాపరాలివీ..
నిందితుడు నాగేశ్వరరావుకు హైదరాబాద్ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉంది. నాలుగేళ్ల కిందట బాధిత మహిళ భర్తను ఒక కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు అతడిని విచారించాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక అతడిని తన వ్యవసాయ క్షేత్రంలో నియమించుకున్నాడు. బాధిత దంపతులు వేరేచోట నివసించేవారు. ఇన్‌స్పెక్టర్ ఒకరోజు బాధిత మహిళను ఫామ్‌హౌస్‌కు వెళ్దామని పిలిచాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా.. వెంటనే అతడు నాగేశ్వరరావుకు ఫోన్ చేశాడు. ఇదంతా మీ భార్యకు చెబుతానని హెచ్చరించడంతో.. 'తప్పయింది.. క్షమించు' అంటూ నాగేశ్వరరావు అతడిని వేడుకున్నాడు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది.
గంజాయి కేసులో ఇరికిస్తానని..:తనను బెదిరించడాన్ని జీర్ణించుకోలేకపోయిన నాగేశ్వరరావు బాధిత మహిళ భర్తను ఒకరోజు సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి రప్పించాడు. అతడి జేబులు, చేతుల్లో గంజాయి సంచులు ఉంచి వీడియోలు, ఫొటోలు తీయించాడు. వాటి ఆధారంగా కేసు నమోదు చేయిస్తానని బాధితుడిని హెచ్చరించి పంపించాడు. గత ఏడాది ఫిబ్రవరి వరకు ఫామ్‌హౌస్‌లో పనిచేసిన అతడు.. తర్వాత పని మానేశాడు. వనస్థలిపురంలో భార్యా పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. నాగేశ్వరరావు వారి కదలికలపై నిఘా ఉంచాడు.
భర్త లేని సమయంలో..:తన కోరిక తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్న ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు.. జులై 6న బాధితురాలికి వాట్సప్ కాల్ చేశాడు. 'నీ మొగుడు ఊళ్లో లేడుగా... నేను వస్తున్నా' అంటూ మాట్లాడాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. ఆ సమయంలో సొంతూరులో ఉన్న అతడు.. తాను వస్తున్నానని ఆమెకు బదులిచ్చాడు. అతడు రాడనుకున్న నాగేశ్వరరావు.. రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. తలుపు వేసి ఆమెను కొట్టాడు. రివాల్వర్ కణతకు గురిపెట్టి అత్యాచారం చేశాడు. అర్ధరాత్రి దాటే వరకు ఆమె ఇంట్లోనే ఉన్నాడు. ఈలోపు ఆమె భర్త తిరిగివచ్చాడు. ఇంట్లో ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావును చూసి ఆగ్రహించి.. కర్రతో కొట్టాడు. వెంటనే నాగేశ్వరరావు రివాల్వర్‌తో భార్యాభర్తలను చంపేస్తానంటూ బెదిరించాడు. ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకుని తన ఫామ్‌హౌస్ వైపు బయలుదేరగా.. ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై టైరు పేలింది. కారు ఆగిపోవడంతో దంపతులిద్దరూ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాగేశ్వరరావు కటకటాలపాలయ్యారు.
సంబంధిత కథనాలు..
మారేడుపల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు అరెస్ట్
ఆ కేసు నుంచి ఈజీగా బయటపడతా.. జైలులో పోలీసు అధికారి బిందాస్..!
మాజీ పోలీస్‌కు అంతర్గత సహకారం.. ప్రాణహాని ఉందంటూ బాధితుల ఆందోళన