maoists killed suraveedu ex sarpanch : ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్ కిడ్నాప్, హత్య, కలకలం రేపాయి. వెంకటాపురం మండలం...కే.కొండాపురం మాజీ సర్పంచ్ కొర్స రమేశ్... దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం.. చర్లకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన రమేశ్.... ఇంటికి తిరిగి రాలేదు. మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో... అతని భార్య రజిత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకి హాని తలపెట్టవద్దని...వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన జరిగి 24 గంటలు కాకముందే... ఛత్తీస్‌గఢ్ సమీపంలో కొత్తపల్లి గ్రామ అటవీ పరిసరాల్లో రమేశ్ మృతదేహం ఈ ఉదయం లభ్యమైంది.
ఈ ఘటనపై వెంకటాపురం, వాజేడు కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదలైంది. పోలీస్ ఇన్ఫార్మార్గా పని చేస్తున్న రమేశ్‌ను ప్రజా కోర్టులో శిక్షించామంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు డబ్బులు ఆశ చూపించి.... రమేశ్‌ను ఇన్ఫార్మర్గా మార్చుకున్నారని... పాలపొడిలో విషం కలిపి పంపించడంతో తమ వాళ్లు అనారోగ్యం పాలయ్యారని, మ్యాదిరి భిక్షపతి చనిపోయినట్లు లేఖలో తెలిపారు. పార్టీకి, ప్రజలకు ద్రోహం తలపెట్టినందునే చంపుతున్నామని.. ఇన్ఫార్మర్లుగా మారే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ... లేఖ విడుదల చేశారు.
అవసరం తీరాగ ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి హత్య చేస్తున్నారు
mulugu sp on ex sarpanch murder : ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం, అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా గిరిజనలు పేదరికంలో మగ్గేలా చూడడమే మావోయిస్టుల సిద్ధాంతమని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి మావోయిస్టులు క్రూరంగా హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం మండలం తిప్పాపురం, కొండాపురం గ్రామాలకు చెందిన కొరస రమేశ్, కురసం రమేశ్‌ను మావోయిస్టులు... సోమవారం రాత్రి అపహరించుకుపోయి.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భీమారం గ్రామానికి తీసుకెళ్లారని... అక్కడి నుంచి కళ్లకు గంతలు కట్టించి 7 గంటలు నడిపించుకుని వేరే ప్రాంతానికి తీసుకువెళ్లారని తెలిపారు. అక్కడ రమేశ్‌ను కాల్చి చంపి.. రెండో వ్యక్తిని చర్ల మండలంలో వదిలివేశారని తెలిపారు.
వెంకటాపురం మండలం సరిహద్దు కొత్తపల్లిలో ఓ వ్యక్తి మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూడగా.. అది కొరస రమేశ్‌దిగా నిర్ధారించారు. పోలీస్ ఇన్ఫార్మర్గా నెపం మోపి రమేశ్‌ను మావోయిస్టులు కాల్చి చంపారని.. జిల్లా ఎస్పీ తెలిపారు. పాముకి పాలు పోసినా విషమే కక్కుతుందన్నది గ్రహించి... గిరిజన ప్రజలు మావోయిస్టులకు సహకరించకూడదని కోరారు. ఇప్పడికైనా మావోయిస్టులను హింసను వీడి, లొంగిపోయి, ఏజెన్సీ ప్రాంత అభివృద్దికి సహకరించాలని ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:Maoists kidnap Ex sarpanch: మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు