Nizamabad Family Suicide Case : రియల్టర్ కుటుంబం బలవన్మరణ ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఆదివారం నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లో సూర్యప్రకాశ్.. భార్య, పిల్లలు సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఈయనకు భాగస్వాములతో కొన్నిరోజులుగా విభేదాలొచ్చాయి. 20 రోజుల కిందట కొందరు దాడి చేశారు. తనకు జరుగుతున్న అవమానాలు, ఒత్తిళ్లను తాళలేకనే కుటుంబమంతా చనిపోవాలని నిర్ణయించుకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
భాగస్వాములపై కేసు..రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సూర్యప్రకాశ్ భాగస్వాములైన వెంకట్ సందీప్, కళ్యాణ చక్రవర్తి, కిరణ్‌లపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు హైదరాబాద్‌కు, మరొకరు విశాఖపట్నానికి చెందినవారని గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల బృందం సోమవారం హైదరాబాద్ వెళ్లింది. నిందితుల్లో ఒకరికి పోలీసు అధికారితో సంబంధాలున్నాయని బంధువులు ఆరోపించారు. సూర్యప్రకాశ్‌పై దాడికి సంబంధించి పోలీసులు సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇల్లు, రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద నెల రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సేకరించే పనిలో ఉన్నారు. 15 రోజుల నుంచి ఈ కుటుంబం హైదరాబాద్‌లో లేకపోవటంతో ఎవరెవరు ఇంటికి, కార్యాలయానికి వచ్చి వెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. సూర్యప్రకాశ్ ఫోన్ చనిపోయే వరకు ఆన్‌లోనే ఉంది. ఆయనకు వచ్చిన ఫోన్లు చాలా వరకు లిఫ్ట్ చేయలేదని గుర్తించారు. వాటిలో అధికంగా ఎవరు చేశారనేది చూస్తున్నారు. వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు.