ఆకాశ్ కష్టపడి సైన్యంలో చేరాలన్న కల నెరవేర్చుకున్నాడు. విధుల్లో చేరాక మొదటిసారి సెలవులకు బిహార్ లోని సొంతూరికి వెళ్లాడు. ‘మా ఊరి ముద్దుబిడ్డ’ అంటూ ఊరంతా అతడికి స్వాగతం చెప్పింది. ఆ ఆనందం ఆవిరైపోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఒకరోజు పోలీసులు వచ్చి ఆకాశ్‌ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఎందుకూ అంటే- సైన్యానికి చెందిన రహస్యాలను విదేశీ గూఢచారులకు చెప్పినందుకు. పగలంతా ఒళ్లు పులిసిపోయేలా శిక్షణలో పాల్గొన్నాక గదికి చేరిన ఆ పాతికేళ్ల యువకుడిని సోషల్ మీడియా సేదదీర్చేది. అక్కడ పరిచయమైన అందమైన అమ్మాయిల మత్తెక్కించే సంభాషణలూ వాళ్లు పంపించే నగ్నచిత్రాలూ పిచ్చివాణ్ణి చేసేవి. వాటికోసం వాళ్లు ఆడమన్నట్టల్లా ఆడాడు. తన ఉద్యోగ విషయాలన్నీ వారికి చెప్పి చివరికి కటకటాల వెనక్కి చేరాడు.
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న యువకుడికి ఫేస్‌బుక్‌లో ఒక యువతి పరిచయమైంది. అందమైన పేరూ అంతకన్నా అందమైన ఫొటోలూ చూసేసరికి ఒళ్లు మరిచిన అతడు మెసెంజర్‌లోకి వెళ్లి ఆమెతో చాటింగ్ మొదలెట్టాడు. కవ్విస్తూ నవ్విస్తూ ఆమె చెప్పే కబుర్లకు పూర్తిగా పడిపోయాడు. ఒకరోజు ఆమె నగ్నంగా వీడియోలో మాట్లాడమని కోరగానే ముందూ వెనకా ఆలోచించకుండా పోజులిచ్చేశాడు. ఆమె మాత్రం కనపడకుండా ఊరిస్తూ అతడి వీడియోలను సేకరించింది. ఆ తర్వాత వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ పలు విడతల్లో పన్నెండు లక్షలు తీసుకుంది. దాచుకున్న డబ్బంతా అయిపోయాక కానీ తాను మోసపోయినట్లు తెలియలేదు సదరు యువకుడికి. అప్పుడు పోలీసు స్టేషన్‌కి వెళ్లాడు.
నగరానికే చెందిన ఒక వైద్యుడూ అదే విధంగా మోసపోయాడు. 15 లక్షలు చెల్లించాక పోలీసుల దగ్గరికి వెళ్లాడు. ఇలాంటి కేసులే మరికొన్ని రావడంతో పోలీసులు పరిశోధించగా వాళ్లు అసలు అమ్మాయిలే కాదనీ, సైబర్ నేరస్థులే అమ్మాయిల పేర్లతో ఈ మోసాలకు పాల్పడుతున్నారనీ తెలిసింది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఉన్న సైబర్ దొంగల ముఠాగుట్టు రట్టయింది. వాళ్లని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి జైలుకు పంపారు. కేవలం ఆరేడు నెలల్లోనే ఆ ముఠా ఇలాంటి నేరాల ద్వారా పాతిక కోట్లు దోచుకుందట.
కారు డ్రైవరుగా పనిచేసే ఒక వ్యక్తి ఆ ఆదాయం సరిపోవడం లేదని పెద్ద ప్లానే వేశాడు. నలుగురు స్నేహితులతో ఒక ముఠాని తయారుచేసుకున్నాడు. అందులో ఒక అందమైన అమ్మాయి ఉంది. యువకులను ఆకర్షించి వలలో వేసుకోవడం ఆమె పని. అప్పుడు తీసిన ఫొటోలను ఆ యువకులకు పంపి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు సంపాదించడం మిగిలినవారి పని. అలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌కీ ఊరికీ కారులో తిరుగుతూ జల్సాలు చేస్తున్న ఆ వ్యక్తినీ ఈమధ్యే పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడలో ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు డేటింగ్ ఆప్‌లో థాయ్ మోడల్‌ని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ బెంగళూరులో కలుసుకోవాలనుకుని విమాన ఛార్జీల కోసం 50 వేలు ఆమె ఎకౌంట్‌లో వేశాడు. హోటల్ రూమ్ కూడా బుక్ చేశాడు. ఆ తర్వాత చూస్తే ఆమె ఖాతా డీయాక్టివేట్ అయింది. పోలీసుల దర్యాప్తులో ఆమె అడ్రసు మిజోరం అని తెలిసింది. యాభైవేలతో అయిపోలేదు, అతని వ్యక్తిగత వివరాలన్నిటినీ ఆమె ఇతర వెబ్‌సైట్లకు అమ్ముకుని కూడా డబ్బు సంపాదిస్తుంది. చాలావరకూ ఈ బ్లాక్‌మెయిల్ చేసేవాళ్లు బాధితుల్ని నేరుగా కూడా కలవడం లేదు. వీడియోకాల్‌తోనే దోపిడీ అయిపోతోంది. విలాసాలకు అలవాటు పడిన కొందరు చదువుకున్న యువకులు కూడా అమ్మాయిల పేర్లతో ఈ పని చేస్తున్నారు.
ఇటువంటి సంఘటనలు ఈ మధ్య తరచుగా వార్తల్లోకి వస్తున్నాయి. సైన్యమూ రాజకీయాల నుంచీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజల్లోకి వచ్చేసిన ‘వలపు వల’ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతోంది. అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
ప్రపంచమంతటా...గత కొంతకాలంగా ప్రపంచ దేశాలన్నీ ‘హనీట్రాప్’ అనేమాట వింటేనే వణికిపోతున్నాయి. రష్యా గూఢచర్య కార్యకలాపాల నుంచి అప్రమత్తంగా ఉండాలని అమెరికా రక్షణశాఖ తరచూ తమ సిబ్బందిని హెచ్చరిస్తూనే ఉంటుందట. చైనా వలలో చిక్కకుండా చూసుకోమని తమ రాజకీయ నాయకులకు ప్రత్యేక తరగతులు పెట్టి మరీ చెబుతుంటుంది. ఆ మధ్య చైనా కూడా తమ విద్యార్థులను తైవాన్ దేశీయుల వలలో పడొద్దంటూ మార్గదర్శకాలు జారీచేసింది. యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్తలకైతే విదేశాల్లో పర్యటించేటప్పుడు ‘ఒళ్లు దగ్గర పెట్టుకోమని’ కాస్త గట్టిగానే చెబుతారట. అందుకు కారణం లేకపోలేదు. కొంతకాలం క్రితం ఇటలీ పాస్‌పోర్టు కార్యాలయ ఉన్నతాధికారి బెల్జియంలో ఓ సమావేశానికి హాజరయ్యాడు. అక్కడ పరిచయమైన ఒక యువతి గలగలా మాట్లాడుతూ వెన్నంటే తిరుగుతోంటే బాగా చదువుకున్న అమ్మాయని గౌరవంగా చూశాడు. రెండు రోజులయ్యేసరికి ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. చివరి రోజు రాత్రి హోటల్లో ఇద్దరూ ఒకే గదిలో గడిపారు. తెల్లారుతూనే ఆ యువతి లేచివెళ్లి గట్టిగా ఏడుస్తూ తనమీద అత్యాచారం జరిగిందని ఫిర్యాదుచేసింది. ఇంకేముందీ పోలీసులొచ్చి సంకెళ్లు వేశారు. దేశం పరువు తీసినందుకు తక్షణం ఉద్యోగం ఊడింది. అందుకే ‘తప్పు మీది కాదని తర్వాతెప్పుడో రుజువవడం వల్ల లాభంలేదు... ఆ పరిస్థితులకు దూరంగా ఉంటేనే మీకూ దేశానికీ కూడా గౌరవం’ అని ఫ్లైట్ ఎక్కేముందు అధికారులకు మరోసారి గుర్తుచేస్తారట. కీలక పదవుల్లో ఉన్న అధికారులను వలలో వేసుకుని రహస్యాలు రాబట్టడానికి శత్రుదేశాలే కానక్కరలేదు, మిత్రదేశాలూ అందుకు వెనకాడటం లేదట.ఇలా అందాన్ని వలగా వేసి తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకోవడమనేది కొత్త కళేమీ కాదు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనే ఉంది. మౌర్యుల కాలంలోనే అందమైన యువతులనూ వేశ్యలనూ గూఢచర్యం కోసం వాడుకునేవారట. ఆ తర్వాత కాలంలో గూఢచారులు మారువేషాలతో ఆ పనిచేస్తే ఈ డిజిటల్ యుగం గూఢచర్యాన్ని మరింత తేలిక చేసింది. స్మార్ట్‌ఫోన్లూ సోషల్‌మీడియా మంచి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. దాంతో గత కొద్ది సంవత్సరాలుగా మన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఈ ‘హనీ ట్రాప్’ వ్యవహారం. నిరంతర పోరాటం ‘కనిపించని శత్రువుని తూటాతో చంపలేము’ సైనిక శిబిరంలో పెద్ద అక్షరాలతో గోడమీద రాసి పెట్టుకున్న హెచ్చరిక ఫోను ముట్టుకున్నప్పుడల్లా గుర్తొస్తుంటుంది జవాన్లకి. రావాలనే అలా రాసిపెట్టుకున్నారు మరి.
సరిహద్దుల్లో కాపలా కాసేటపుడూ యుద్ధరంగంలో శత్రువుతో తలపడేటపుడూ ప్రాణాల్ని కాపాడుకోవడానికి సైనికులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లూ హెల్మెట్లూ వాడతారు. కానీ ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న పెద్ద శత్రువు సరిహద్దులకు అవతల లేదు... కంటోన్మెంట్ శిబిరాల్లో, సైనికుల చేతుల్లోనే ఉంది. తెరల మీద అందాలను ఆరబోస్తూ తీయని మాటలతో మత్తెక్కిస్తూ ఏవో లోకాల్లో తేలిపోయేలా చేసే వర్చువల్ శత్రువది. ఆ మత్తులో కూరుకుపోయి తమను తాము మర్చిపోయి శత్రువు చేతిలో దేశ రహస్యాల్ని పెట్టేస్తున్నారు కొందరు అమాయకులు. ఈ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలీక, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండే జవాన్లను స్మార్ట్‌ఫోన్లు వాడొద్దని చెప్పలేక సతమతమవుతున్నారు అధికారులు. అప్పటికీ డేటింగ్, సోషల్ మీడియాకి సంబంధించి పలు ఆప్స్‌ని నిషేధించిన సైన్యం సామాజికమాధ్యమాలను వాడకూడదని సిబ్బందిని కట్టడి చేసింది. అయినా కొంతమంది నియమాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. జూనియర్లే ఎక్కువగా ఈ వలలో పడుతున్నట్లు గుర్తించారు అధికారులు. దాంతో మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం హనీట్రాప్స్‌ని గుర్తించడానికి తీవ్రంగా కృషిచేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘మాయాజాల్’ విభాగం ద్వారా సోషల్ మీడియాని జల్లెడ పడుతోంది.
వెలుగులోకి వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే, ఐఎస్‌ఐ- మన దళాల కదలికలూ మోహరింపునకు సంబంధించిన విషయాల్నీ, షిఫ్ట్ సమయాలూ ఉపయోగిస్తున్న వాహనాల వివరాలూ అవి వెళ్లే దారులూ.... తదితర సమాచారాన్నీ ఎక్కువగా సేకరిస్తోందని తెలుస్తోంది. పైకి ఇవన్నీ చిన్న విషయాలుగా అన్పిస్తాయి కానీ అవే చాలా పెద్ద సమస్యలకు దారితీస్తాయంటారు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డిబి శెకట్కర్. శత్రువు ఎప్పుడూ చిన్నగానే మొదలుపెడతాడు. మెల్లగా సమయం తీసుకుని నమ్మకమైన కాంటాక్టుని సంపాదించాకే వాళ్లకి పెద్ద టార్గెట్‌లు ఇస్తాడు. కాబట్టి అక్కడిదాకా వెళ్లకముందే సమస్యని మొదట్లోనే తుంచేయాలి... అంటారాయన.