తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicides due to Debts: 'వడ్డీ' వేధింపులు.. ఒత్తిడితో బాధితుల బలవన్మరణాలు - Many are committed suicides by moneylenders harassment

Suicides due to Debts: రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల వేధింపులకు అనేకమంది బలైపోతున్నారు. కరోనా వచ్చినా.. కరవు వచ్చినా.. వీరి పంట పండినట్లే. ఇటీవల కరీంనగర్‌ పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి అనేక దస్తావేజులు బయటపడ్డాయి. రాష్ట్రమంతటా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. రెండేళ్లుగా వేధిస్తున్న కరోనా.. దిగువ మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు అప్పులు చేయడం మొదలుపెట్టారు. సాగులో నష్టాల్ని చవిచూస్తున్న చిన్న, సన్నకారు రైతులూ వడ్డీ వ్యాపారుల బారిన పడ్డారు. ఈ వ్యాపారానికి ఎక్కడా సరైన మార్గదర్శకాలు, నిబంధనలు లేకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల దందా నిరాటంకంగా సాగుతోంది.

Suicides due to Debts
వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్యలు

By

Published : Apr 3, 2022, 7:18 AM IST

Suicides due to Debts: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన హోటల్‌ నిర్వాహకుడు రవి ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారి వద్ద రూ.4 వేలు అప్పు తీసుకున్నారు. అసలు చెల్లించినా.. రెండు వారాలకు రూ.12 వేలు వడ్డీ కట్టాలని వ్యాపారి డిమాండ్‌ చేయడంతో పురుగుల మందు తాగి చనిపోయారు. ఆయన భార్య, ఇద్దరు చిన్న పిల్లలు రోడ్డున పడ్డారు.

  • వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక జనవరిలో నిజామాబాద్‌కు చెందిన సురేష్‌, ఆయన భార్య, ఇద్దరు కుమారులు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు.
  • వడ్డీ వసూలు చేసిపెట్టే ముఠాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. 30 శాతం కమీషన్‌తో పనిచేసే ఇలాంటి ముఠాలను నియమించుకుని మరీ కొందరు వేధింపులకు పాల్పడుతుండటం ఈ వ్యాపారం ఎలా సాగుతుందో చెప్పేందుకు నిదర్శనం.

స్థాయిని బట్టి..

  • రేషన్‌ సరకులు తెచ్చుకునేందుకు బలహీనవర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన తెల్ల రేషన్‌కార్డులు దగ్గర పెట్టుకొని రుణం ఇచ్చే దళారులూ కోకొల్లలు. హైదరాబాద్‌ పాతబస్తీలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఇలాంటి కార్డులు వందల్లో బయటపడ్డాయి.
  • డైలీ ఫైనాన్స్‌ వ్యాపారుల లక్ష్యం చిరువ్యాపారులే. రోజుకు రూ.వెయ్యికి రూ.100 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. ఉదయం రూ.900 ఇచ్చి.. సాయంత్రం రూ.వెయ్యి వసూలు చేస్తారు. ఒక్కరోజు ఆలస్యమైతే వడ్డీ రూ.200 అవుతుంది.
  • ఇక విద్యార్థులకైతే గ్యారంటీ లేకుండానే రుణ యాప్‌లు అప్పులిచ్చి తర్వాత వేధిస్తున్నాయి.
  • వ్యవసాయదారులకు స్థానిక వ్యాపారులే రుణం ఇచ్చి.. భూమిని తనఖా పెట్టుకుంటారు.

వేధింపులు వివిధ రకాలు

  • అప్పివ్వడమే ఉపాధిగా పెట్టుకున్న కొందరు.. పొద్దునే కుటుంబంతో సహా రుణగ్రహీత ఇంటికి చేరతారు. రోడ్డుమీద నిలబడి కేకలు వేస్తూ, బూతులు తిడుతూ అవమానిస్తారు. ఇంట్లోకి చొచ్చుకొచ్చి దౌర్జన్యం చేస్తారు. అప్పు తీర్చే వరకూ ఇలాగే బాధిస్తారు.
  • కరీంనగర్‌లో ఏఎస్సైగా పనిచేసిన మోహన్‌రెడ్డి లాంటివారైతే ఏకంగా పోలీస్‌స్టేషన్‌ నుంచే ఫోన్‌ చేయిస్తారు. అప్పు తీసుకున్న పత్రాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా కేసు పెడతామంటారు. అవసరమైతే పోలీసు వాహనం రప్పిస్తారు. ఇలా అవమానపరిచి.. ఉన్నది అమ్మే పరిస్థితి కల్పిస్తారు.
  • ఇక రౌడీలను పంపి బెదిరింపులకు పాల్పడటం మామూలే. రోజువారీ వడ్డీ వ్యాపారులు ఇలాంటి పనులు చేస్తుంటారు.
  • రుణ యాప్‌ల నిర్వాకం మరోలా ఉంటుంది. తీసుకున్న రుణం చెల్లించేవరకూ ఫోన్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయి. అప్పటికీ పనికాకపోతే వారికి ష్యూరిటీ పెట్టిన వారిని బెదిరిస్తారు. ఆ తర్వాత రుణం తీసుకున్నవారి మిత్రుల ఫోన్‌నంబర్లకు సందేశాలు పంపుతారు.

చైనా రుణయాప్‌ల ఆగడాలు భరించలేక హైదరాబాద్‌ పేట్‌బషీరాబాద్‌కు చెందిన చిరుద్యోగి చంద్రమోహన్‌, అంబర్‌పేటకు చెందిన గార్డు నరేష్‌లు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

కోట్లలో కొల్లగొడుతున్నారు

వడ్డీవ్యాపారం అత్యంత లాభదాయకం కాబట్టే మామూలు వ్యక్తుల నుంచి చైనా యాప్‌ల వంటి అంతర్జాతీయ సంస్థలూ ఈ దందాలోకి దిగుతున్నాయి. కరీంనగర్‌లో వడ్డీవ్యాపారం చేసిన ఓ ఏఎస్సై ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. చైనా రుణయాప్‌లు రూ.173 కోట్ల పెట్టుబడి ద్వారా సంవత్సరకాలంలోనే ఆర్జించిన లాభం నుంచి రూ.429.29 కోట్లు విదేశాలకు తరలించాయి. వడ్డీ వ్యాపారం విశ్వరూపానికి ఈ రెండు ఉదంతాలే నిదర్శనం.

ఇదీ చదవండి:సన్నరకం వరికి సరే కానీ.. విత్తనాలకు రాయితీ లేనట్టే!

ABOUT THE AUTHOR

...view details