రంగారెడ్డి జిల్లా మంచి రేవుల ఫామ్ హౌజ్ పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌కు బెయిల్‌పై విడుదలయ్యారు. ఉప్పర్ పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో... చర్లపల్లి జైలు నుంచి గుత్తా సుమన్ బయటికి వచ్చారు. మంచిరేవుల పేకాట కేసులో నార్సింగి పోలీసులు 9రోజుల క్రితం 30మందిని అరెస్ట్ చేశారు. 29 మందికి ఉప్పర్ పల్లి కోర్టు ఈ నెల 2న బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు పిటీషన్ దాఖలు చేయడంతో... కోర్టు 2రోజుల కస్టడీకి అనుమంతించింది.
సుమన్‌ను రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఉన్న పాత కేసులతో పాటు... పేకాట శిబిరాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. గుత్తా సుమన్‌పై గచ్చిబౌలీ, పంజాగుట్ట, కూకట్‌పల్లి పీఎస్‌లలో కేసులున్నట్లు గుర్తించారు. ఏపీలోనూ పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. మంచిరేవుల ఫామ్ హౌజ్‌లో క్యాసినో కాయిన్స్‌తో పేకాట నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు రూ. 6లక్షలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. గుత్తా సుమన్ ఎక్కడెక్కడ పేకాట శిబిరాలు నిర్వహించారనే సమాచారన్ని సేకరించారు. కస్టడీ ముగిసిన తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. గుత్తా సుమన్ తరఫు న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.