సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమ్మాపూర్‌కు చెందిన కె. కార్తీక్ యాదవ్... కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మీర్‌పేటలో నివాసం ఉంటున్నాడు. ఎల్జీ కంపెనీలో మియాపూర్ ఏరియా ఫీల్డ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా కారణంగా చేస్తున్న ఉద్యోగం దూరం కావడం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల గత కొంత కాలంగా కార్తీక్... మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తండ్రి, సోదరులు కార్తీక్‌కు ధైర్యం చెప్పి ఇంటికి పంపించారు.
Suicide: సెల్పీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్య - selfie suicide news
కరోనా కారణంగా ఉద్యోగం పోయింది. మెల్లమెల్లగా ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దానికి తోడు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వీటన్నింటితో మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా ఆ వ్యక్తికి జీవితంపైనే విరక్తి వచ్చింది. కట్టుకున్న భార్య, పిల్లలు ఏమవుతారని ఆలోచించలేకపోయాడు. ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. సూసైడ్‌కు మందు తన ఆవేదనను సెల్ఫోన్లో చిత్రీకరించి.. కుటుంబసభ్యులను పంపించాడు.
రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ టోల్‌ప్లాజా సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కార్తీక్‌ను పోలీసులు గమనించి అక్కడినుండి పంపించేశారు. గురువారం ఉదయం విధులకు వెళ్తున్నట్లు భార్య జ్యోతికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన కార్తీక్... కొత్తూరు శివారులోని ఓ చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్నాడు. ఈ క్రమంలో వీడియో తీసి... లైవ్ లొకేషన్‌తో సహా కుటుంబ సభ్యులకు పంపించాడు. వీడియో సందేశాన్ని చూసిన భార్య... కుటుంబసభ్యులకు తెలపింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా... పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు గుర్తించారు.
తన మృతికి ఎవరూ కారణం కాదని... జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు వీడియోలో కార్తీక్ వివరించాడు. తన కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు. మృతునికి ఐదేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.