పట్టా భూమిలో గ్రీన్ ల్యాండ్ బోర్డును ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు.
మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం - telangana crime news
తమ భూమిని ప్రభుత్వ భూమంటూ మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ మున్సిపాలిటీ 17వ వార్డులో తోట భిక్షపతి కుటుంబసభ్యులు జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి సంబంధించిన భూమిలో మున్సిపల్ అధికారులు గ్రీన్ ల్యాండ్ బోర్డును ఏర్పాటు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ భూమిలో బోర్డు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ తోట భిక్షపతి కుటుంబసభ్యులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. భిక్షపతి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తమ భూమిలో ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేసి వేధిస్తున్నారని.. తమకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
మాది హౌసింగ్ బోర్డు కాలనీ. 17వ వార్డులో నివాసం ఉంటాం. మాకు 166,167,168/2 సర్వే నెంబర్లో 32 గుంటల భూమి ఉంది. అయితే మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్ మారినప్పుడల్లా ఈ భూమిలో గ్రీన్ ల్యాండ్ ఉందని హద్దులు పెడుతున్నారు. మాకు పట్టా ఉంది. పాసు పుస్తకం ఉంది. అయినా వినకుండా అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు.- తోట భిక్షపతి, బాధితుడు