ఇల్లంతా రక్తపు మడుగు.. చెల్లచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం. పెద్దలు మొదలకుని పసికందు వరకు కనికరం లేకుండా అత్యంత పాశవికంగా హతమార్చాడు. కాళ్లూ చేతులు ఎక్కడ పడితే అక్కడ నరికేశాడు. మాటు వేసి ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు పదునైన ఆయుధంతో నరమేధం సృష్టించాడు. ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేశాడు.
దారుణం: పాతకక్షలతో కుటుంబంలో ఆరుగురి హత్య - visakhapatnam crime news
08:38 April 15
విశాఖలో కుటుంబం దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పెందుర్తి మండలం జుత్తాడలో పాత కక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలయ్యారు. కొద్ది రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పల రాజు అనే వ్యక్తి ఆర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మరో కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటనతో జుత్తాడలో విషాదఛాయలు అలముకున్నాయి.
మృతులు బొమ్మిడి రమణ(63), బొమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్(2), బొమ్మిడి ఉర్విష(6 నెలలు)గా గుర్తించారు. ఘటన తర్వాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆరుగురు హత్యకు గురైన ఘటనతో జుత్తాడ ఉలిక్కిపడింది. ఈ ఉదంతం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.
ఇవీచూడండి:విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి