తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు! - శ్రీకాకుళం రణస్థలంలో ఆస్తికోసం అన్న, అక్కను చంపిన వ్యక్తి న్యూస్

ఒకే అమ్మ కడుపున పుట్టినా... ధన వ్యామోహంలో పేగు బంధాన్ని మర్చిపోయాడు. సొంత అన్న, అక్కను కర్కశంగా హత్య చేసి రక్తబంధాన్ని తెంచాడు. ఆస్తి కోసం ఓ తమ్ముడు తన తోబుట్టువులనే విచక్షణారహితంగా నరికిచంపిన ఘటన.. ఏపీ శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది.

ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!
ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!

By

Published : Mar 7, 2021, 8:50 PM IST

ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!

ఆపదలో ఆదుకున్న అన్ననే... ఆస్తి కోసం అంతమొందించాడు. అన్నను చంపొద్దంటూ ప్రాధేయపడిన అక్కనూ కత్తితో నరికి చంపాడు. ఏపీ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో సొంత అన్న, అక్కను.. తమ్ముడు రామకృష్ణ హత్య చేయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. స్థానికంగా ఉండే గొర్లె సన్యాసిరావు, జయమ్మ, గొర్లె రామకృష్ణ ఒకే తల్లి పిల్లలు.

ఇటీవలే కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పరిహారం పంపిణీ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. సమస్యను గ్రామ పెద్దల దృష్టిలో పెట్టినప్పటికీ గొడవ సద్దుమణగలేదు. ఈ తగాదా కాస్తా చినికిచినికి గాలివానలా మారి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. సొంత బాబాయ్ చేసిన దారుణాన్ని చూసి సన్యాసిరావు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు.

కత్తితో నరికి...

పరిహారం పంపిణీకి సన్యాసిరావు అడ్డుపడుతున్నాడని భావించిన తమ్ముడు రామకృష్ణ.. ఉదయం వేళ పశువుల కొట్టంలో ఉన్న అన్నను వెనక వైపు నుంచి వెళ్లి కత్తితో నరికి చంపాడు. అన్నను చంపేస్తున్నాడంటూ కేకలు వేసి అడ్డుకునేందుకు యత్నించిన అక్క జయమ్మనూ హత్య చేశాడు. జయమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. సన్యాసిరావు ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు.

'మా నాన్న, అత్తను.. మా బాబాయ్ రామకృష్ణ దారుణంగా నరికి చంపాడు. మేమంతా ఉదయం నిద్ర లేచే లోపే బయట పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ.. బయటకొచ్చేసరికి నాన్న, అత్త రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్తి కోసం మా బాబాయ్​.. మా వాళ్లను దారుణంగా నరికి చంపాడు. ప్రాణాలతో పోరాడుతున్న మా నాన్నను ఆస్పత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేస్తే.. మా ఫోన్ కూడా తీసుకొని మాపై దాడి చేశాడు.' అంటూ సన్యాసిరావు కుమార్తెలు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి, అత్త లేకుంటే తమకు దిక్కెవరంటూ విలపిస్తున్న సన్యాసిరావు కుమార్తెల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రంగంలోకి పోలీసులు

అన్న, చెల్లి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను క్లూస్ టీంతో పరిశీలించి పోస్ట్​మార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు జె.ఆర్.పురం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హత్యపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ ఎం.మహేంద్ర తెలిపారు.

ఇదీ చదవండి:' క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేయాలని చెప్పి.. రూ.3 లక్షలు కాజేశారు'

ABOUT THE AUTHOR

...view details