తెలంగాణ

telangana

ETV Bharat / crime

cyber crime in warangal : ఆన్‌లైన్ మోసం.. క్లిక్ చేశాడు.. బుక్కయ్యాడు

తరచూ మన మొబైల్ ఫోన్‌లకు చిత్రవిచిత్ర సందేశాలొస్తుంటాయి. ముఖ్యంగా ఈ లింక్ క్లిక్ చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే మీ ఖాతాలో లక్ష రూపాయలు జమ అవుతాయి అంటూ రకరకాల మెసేజ్‌లు వస్తుంటాయి. పొరపాటున వాటిని క్లిక్ చేశారో మీరు బుక్కైనట్టే ఇక. ఇలా లింకులు పంపిస్తూ వాటి ద్వారా మీ ఖాతాల్లో ఉన్న నగదును కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో చోటుచేసుకుంది. తన మొబైల్ ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి ఓ వ్యక్తి రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే..?

cyber crime in waranga
cyber crime in waranga

By

Published : Sep 16, 2022, 8:43 AM IST

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ముంజాలు మధుక్రిష్ణన్ అనే వ్యక్తి మొబైల్‌ ఫోన్‌కు జూన్ 16న ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఓ లింక్ వచ్చింది. మధు పొరపాటున ఆ లింక్ క్లిక్ చేశాడు. అంతే.. మరు నిముషంలో అతడి ఖాతాలో రూ.8వేలు జమ అయినట్లు మరో సందేశం వచ్చింది. అది చూసిన మధు ఫుల్ ఖుష్ అయ్యాడు.

ఐదు రోజుల తర్వాత మధుకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. తన ఖాతాలో పడిన నగదును తిరిగి ఇవ్వాలని ఆ ఫోన్‌కాల్ సారాంశం. మొదట కాస్త నిరాశపడిన మధు ఎలాగూ అవి తన డబ్బులు కావు కదా అని అతడికి తిరిగి పంపించాడు. కథ ఇక్కడితో అయిపోతే మనం దీని గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు. డబ్బు పంపించినా కూడా ఆ వ్యక్తి మళ్లీ మధుకు కాల్ చేశాడు. మరింత డబ్బు పంపించాలని వేధించడం మొదలుపెట్టారు. మొదట మధు ససేమిరా అన్నాడు. కానీ అడిగినంత డబ్బు పంపించకపోతే తన న్యూడ్ ఫొటోలు క్రియేట్ చేసి తన కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి పంపిస్తానని బెదిరించాడు. ఇలా పలుమార్లు బెదిరించడంతో పలుమార్లు దాదాపు రూ.4 లక్షల వరకు మధు ఆ వ్యక్తికి చెల్లించాడు.

బెదిరింపులు తీవ్రం అవ్వడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. మధుక్రిష్ణ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నగదు బదిలీలు, బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. ఇలా మొబైల్ ఫోన్‌లకు వచ్చే అన్‌నౌన్ లింకులను క్లిక్ చేయొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details