తెలంగాణ

telangana

ETV Bharat / crime

అప్పు ఇచ్చిన వ్యక్తితో వివాహేతర సంబంధం.. సినీ ఫక్కీలో భర్త హత్య - వివాహేతర సంబంధం

Extra marital affair : ఇంట్లో ఆర్థిక ఇబ్బందులో ఓ మహిళ ఒక వ్యక్తి వద్ద రూ.50వేలు అప్పు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం భర్తకు తెలిసి ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఇది జీర్ణించుకోలేని అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ మహిళ, ఆమె తల్లి, తన స్నేహితుడి సాయంతో ఆమె భర్తను హతమార్చేందుకు పక్కా ప్లాన్ వేశాడు. సినీ ఫక్కీలో అతణ్ని దుర్మార్గంగా హత్యచేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

Extra marital affair
Extra marital affair

By

Published : Apr 9, 2022, 9:09 AM IST

Extra marital affair : అప్పు తీసుకున్న సందర్భంగా మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె భర్తను అడ్డు తొలగించుకోవడం అతను అమలు చేసిన ప్రణాళిక ఓ క్రైం సినిమాను తలపిస్తోంది. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ కిషన్‌ శుక్రవారం జడ్చర్లలో విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జడ్చర్ల మండలంబూర్గుపల్లికి చెందిన శ్రీశైలం (29)కు తొమ్మిదేళ్ల కిందట హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సంగీతతో వివాహమైంది. ఈమె తల్లి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గ్రామానికి చెందిన వెంకటమ్మ సుమారు 20 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వెళ్లి జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. 2016లో శ్రీశైలం జీవనోపాధి కోసం భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఎల్బీనగర్‌ రత్నానగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య సంగీత ఎదురింట్లో ఉండే విక్రం వద్ద రూ.50 వేలు అప్పు తీసుకుంది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసిన శ్రీశైలం మరో ఇంట్లోకి మారినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గత సంవత్సరం కుటుంబాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి, కూలీ పనులు చేసుకుంటున్నారు.

స్నేహితుడిని బంధువుగా పంపి :సంగీత దగ్గర చరవాణి లేకపోవడంతో సంబంధాన్ని కొనసాగించడం కోసం ఆమె సహకారంతో విక్రం తన స్నేహితుడు రాజును ఆమె దూరపు బంధువుగా నాలుగు నెలల కిందట వారి ఇంట్లో మకాం వేయించాడు. అక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రియురాలి సాయంతో ఆమె భర్త శ్రీశైలంను హతమార్చాలని పథకం పన్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఇనుప రాడ్‌ను చేయించాడు. గత నెల 31న ప్రత్యేకంగా ఒక ద్విచక్ర వాహనాన్ని, కొత్త దుస్తులను కొన్నాడు. మద్యంసీసా, కారం పొడి ప్యాకెట్‌ తీసుకుని అదేరోజు రాత్రి పది గంటల సమయంలో బూర్గుపల్లి సమీపంలో ఉన్న కిష్టంపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ ఓ దుకాణంలో మంచినీళ్ల బాటిల్‌ కొన్నాడు. దుకాణ యజమాని చరవాణితోనే తన స్నేహితుడైన రాజుకు ఫోన్‌ చేసి.. సంగీత తల్లి వెంకటమ్మ రూ.50 వేలు ఇచ్చి పంపిందని, తాను ఊరిబయట ఉన్నానని వచ్చి తీసుకెళ్లాల్సిందిగా శ్రీశైలంను నమ్మించి తీసుకురావాలని చెప్పాడు. రాజు మాటలు నమ్మిన శ్రీశైలం అతని వెంట ఊరి బయటకు వచ్చి మద్యం తాగుతుండగా విక్రం తరవాత అక్కడికి చేరుకున్నాడు. శ్రీశైలం కళ్లలో కారం చల్లి, ప్రత్యేకంగా చేయించిన ఇనుప రాడ్డుతో తలపై మోది హతమార్చాడు. అనంతరం రాజు తిరిగి బూర్గుపల్లికి వెళ్లగా.. విక్రం ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం రోడ్డు పక్కన శ్రీశైలం మృతదేహాన్ని గుర్తించారు. అతడి చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు సంగీత, వారి ఇంట్లో ఉంటున్న రాజుపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. నిందితుడు విక్రం, హత్య కుట్రకు సహకరించిన సంగీత తల్లి వెంకటమ్మ శుక్రవారం జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి దగ్గర ఉండగా అదుపులోకి తీసుకొని విచారించామని, హత్య కేసును ఒప్పుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. నిందితులు నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details