తెలంగాణ

telangana

ETV Bharat / crime

Pregnant Lady Murder in Hyderabad : నిండు గర్భిణిని నరికి చంపిన ఆడపడుచు భర్త - pregnant lady murder in hyderabad

Pregnant Lady Murder in Hyderabad : భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య తనపై ఫిర్యాదు చేయడానికి కారణం బావమరిదేనని భావించిన ఆ వ్యక్తి అతడిపై కోపం పెంచుకున్నాడు. అంతటితో ఆగక అతణ్ని చంపాలనుకున్నాడు. దానికోసం పక్కా ప్లాన్ వేశాడు. వేటకొడవలి కొని బావమరిదిని చంపేందుకు అతడి ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో అతడి లేకపోయేసరికి బావమరిది భార్యను వేటకొడవలితో నరికిచంపాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో చోటుచేసుకుంది.

Pregnant Lady Murder in Hyderabad
Pregnant Lady Murder in Hyderabad

By

Published : Sep 14, 2022, 10:16 AM IST

Pregnant Lady Murder in Hyderabad : భార్య తనపై కేసు పెట్టడానికి కారణం అతనే అని, అతడిని చంపాలని భావించిన ఓ వ్యక్తి.. సమయానికి అతడు లేకపోవడంతో ఇంట్లో ఉన్న నిండు గర్భిణిని వేటకొడవలితో నరికి చంపాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

హత్యకు గురైన స్రవంతి

Pregnant Lady Murder in Gachibowli : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వి.వెంకటరామకృష్ణ తన భార్య వాసంశెట్టి స్రవంతి (32)తో కలిసి కొంతకాలం క్రితం హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వారికి చైత్ర అనే పదేళ్ల కుమార్తె ఉంది. స్రవంతి 8 నెలల గర్భిణి. 2020లో తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీప్రసన్నకు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలేనికి చెందిన కావూరు శ్రీరామకృష్ణ(35)తో పెళ్లి చేయించడంలో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించాడు.

కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో, లక్ష్మీప్రసన్న తన పుట్టింటి వాళ్లకు చెప్పారు. దీంతో వెంకట రామకృష్ణ చెల్లెలి కాపురం సరిదిద్దే ప్రయత్నం చేసినా శ్రీరామకృష్ణ వినలేదు. గత ఏడాది పేరుపాలెంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. చర్చలు విఫలం కావడంతో లక్ష్మీప్రసన్న హైదరాబాద్‌లో పుట్టింటికి వచ్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నెలక్రితం భర్త, అత్తింటివారిపై ఆమె చందానగర్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీరామకృష్ణకు నోటీసులు జారీచేశారు. దీనంతటి వెనుక రామకృష్ణ దంపతులే ఉన్నారని వారిపై శ్రీరామకృష్ణ కక్ష పెంచుకున్నాడు. బావమరిదిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఎర్రగడ్డలో వేటకొడవలిని కొని.. ఈ నెల 6న కొండాపూర్‌లో బావమరిది ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వెంకటరామకృష్ణ తన కుమార్తెను స్కూలు నుంచి తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా స్రవంతి శ్రీరామకృష్ణ చేతిలో వేటకొడవలిని చూసి కేకలు వేస్తూ.. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ శ్రీరామకృష్ణ.. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుకభాగం, భుజం మీద దాడిచేసి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలి కేకలు విని పక్కింటివారు వచ్చి ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 11 గంటలకు మృతి చెందారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించి, అతడిని మర్నాడే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details