తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రాణాన్ని బలిగొన్న.. ఫార్వర్డ్‌ సందేశం - అమలాపురం వార్తలు

ఏపీ తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి చెందిన శ్రీనివాస్​ అనే వ్యక్తి పోలీసులు విచారించారనే ఆందోళనతో మృతి చెందాడు. తనకు వచ్చిన ఓ మెసేజ్​ను వాట్సాప్​లో వేరే వారికి పంపడంపై సైబర్​క్రైమ్​ పోలీసులు విచారణ చేపట్టడంతో అతడు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

man suicide, man suicide in ap
ఏపీలో వ్యక్తి ఆత్మహత్య, ఏపీ నేర వార్తలు

By

Published : May 15, 2021, 1:37 PM IST

ఏపీ తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం పట్టణంలో ఫార్వర్డ్‌ సందేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఒక వాట్సాప్‌ సందేశాన్ని ఫార్వర్డ్‌ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనతో అస్వస్థతకు గురై నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివాస్‌ (టైటానిక్‌) (38) శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల వేధింపుల కారణంగా చనిపోయినట్లు మృతుడి భార్య వెంకటపద్మ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

"ఆక్వా కంపెనీలో పనిచేసే శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌కు 'కోళ్లకు కూడా సోకిన కరోనా మహమ్మారి' అనే వాట్సాప్‌ సందేశం వచ్చింది. దానిని ఆయన ఇతర గ్రూప్‌లకు పంపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విచారించారు. తనకేమీ తెలియదని ఆయన ఎంత చెప్పినా వారు వినలేదు. దాంతో శ్రీనివాస్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. శరీరంపై చెమటలు పట్టి కూలిపోయాడు. చికిత్స నిమిత్తం మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. చివరకు అమలాపురం కిమ్స్‌లో చేర్పించాం. ఆ తర్వాత గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు" అని భాదితులు పేర్కొన్నారు.

ఇది చాలా పెద్ద కేసు అవుతుందని బెదిరిస్తూ శ్రీనివాస్‌ ఫోన్‌ను తీసుకెళ్లిన స్థానిక పోలీసులు.. ఆయన చనిపోయిన కొద్ది సేపటికి దానిని వెనక్కి తెచ్చి ఇచ్చేసినట్లు మృతుని భార్య తెలిపింది. హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్‌ సీఐ రాజేష్‌, ఎస్సై రంజిత్‌కుమార్‌ తన భర్తను మానసికంగా హింసించారని ఆమె ఆరోపించారు. శ్రీనివాస్‌కు భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. దీనిపై అమలాపురం పట్టణ ఇన్‌ఛార్జి ఎస్సై సత్యప్రసాద్‌ను వివరణ కోరగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details