Man Died in Elephants Attack : ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలు ఏనుగుల దాడుల పట్ల ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల బెడద వల్ల ఒంటరిగా బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఏనుగులు ఎప్పుడు దాడి చేస్తాయో తెలియటం లేదని వాపోతున్నారు. అయితే ఇక్కడ ఏనుగుల దాడులు పెరుగుతూనే ఉన్నాయి. దాడులు పెరగటమే కాకుండా దాడులలో గాయపడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య అదే స్థాయిలో ఉంటోంది.
తాజాగా ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భామిని మండలం తాళడకు చెందిన చిన్నారావు అనే రైతు ఏనుగులు దాడిలో మృత్యువాత పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారావు పొలం వద్ద ఉన్న ధాన్యం కాపలా కోసం.. ఆదివారం సాయంత్రం పొలం దగ్గరికి వెళ్లాడు. ధాన్యాన్ని ఏవైనా జంతువులు నాశానం చేస్తాయనే భయంతో అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఏనుగుల గుంపు అక్కడికి వచ్చి అతనిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారావును స్థానిక రైతులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్సపొందుతూ.. అతను మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పొయాడు. చిన్నరావు మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని.. ఈ దాడుల వల్ల ప్రాణా హాని ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జరిగిన దాడి వల్ల వారు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఏనుగులను తరలించాలని ఆందోళన : ఏనుగుల దాడిలో గాయపడిన చిన్నరావు మృతితో పామిడి మండలంలోని ఘనసర ప్రజలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏనుగులను బంధించి తరలించాలని పామిడి మండలం ఘనసర వద్ద రహదారిపై ఆందోళనకు దిగారు. ఏనుగుల సంచారం వల్ల ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. తరచూ ప్రాణ నష్టం జరుగుతుండటం వల్ల ఏనుగులను తరలించాలని డిమాండ్ చేశారు. గతంలో అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవటం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఘటనాస్థలానికి పోలీసుల చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రహదారిపై ఆందోళన చేపట్టడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోయి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి :