తెలంగాణ

telangana

ETV Bharat / crime

'తలకు తల పోవాలి' అని పెద్దల తీర్పు.. వ్యక్తి దారుణ హత్య - పంచాయతీ తీర్మానంతో  వ్యక్తి దారుణ హత్య

Murder: ‘మా నాన్న ఎలా చనిపోయాడో.. మీవాడు కూడా అలానే చావాలి. తలకు తల పోవాలి. లేకపోతే అందర్నీ చంపేస్తాం’ ఇవేవో సినిమా డైలాగులా ఉన్నాయనుకుంటే పొరపాటే. ఈ మాటలన్నీ ఓ కుటుంబం వారు దాడి చేసిన కుటుంబానికి చెప్పిన మాటలు. ఇవి వినగానే.. వారికి ఒక్కసారి గుండె ఆగినంత పనైపోయింది. ఏం చేయాలో తెలియక.. పంచాయతీ పెద్దలను ఆశ్రయిస్తే.. వారు 'తలకు తల' అని చెప్పిన తీర్పుతో అంతా విస్తుపోయిన ఘటన.. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.

Murder
Murder

By

Published : Jun 2, 2022, 12:31 PM IST

Murder: ‘మా నాన్న ఎలా చనిపోయాడో.. మీవాడు కూడా అలానే చావాలి. తలకు తల పోవాలి. లేకపోతే అందర్నీ చంపేస్తాం’ అన్న మాటలకు ఆ కుటుంబసభ్యులు తీవ్రంగా భయపడ్డారు. ఏం చేయాలో తెలియక, తమ కుటుంబంలోనే మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని చంపేశారు. పంచాయతీ తీర్మానంతో జరిగిన ఈ వింత ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. ఈ కేసు వివరాలను పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి బుధవారం వెల్లడించారు.

సీతంపేట మండలం రేగులగూడలో మే 27న జరిగిన ఓ పెళ్లిలో గ్రామానికి చెందిన సవర గయా(60) కుమార్తె పద్మను ఉసిరికిపాడుకు చెందిన మతిస్థిమితం లేని సవర సింగన్న(33) కర్రతో కొట్టాడు. దీంతో సింగన్నను గయా కిందకు తోసేశాడు. సింగన్న కోపంతో అతనిపై పెద్దకర్రతో దాడిచేయగా గయా అక్కడికక్కడే మృతిచెందాడు. మర్నాడు గయా కుమారులు, స్థానికులు సింగన్న కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇంట్లో బంధించారు. అతని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అంతా వచ్చాక పంచాయతీ నిర్వహించి, తమ తండ్రి ఎలా చనిపోయాడో ఇతను కూడా అలాగే చావాలని డిమాండు చేశారు. లేకపోతే అందర్నీ చంపేస్తామని బెదిరించారు. దీంతో పెద్దలంతా ‘తలకు తల’ అని తీర్పుచెప్పారు.

కుటుంబంలో అందరి ప్రాణాలు తీస్తారని భయపడిన సింగన్న కుటుంబసభ్యులు తీర్పు అమలుకు అంగీకరించారు. ఈనెల 28న అతనికి విషమిచ్చారు. మరణించలేదని ఉరేశారు. ఎవరికీ తెలియకుండా శవాన్ని కాల్చేశారు. మొదట సాధారణ మరణాలుగా భావించినా.. గ్రామంలోని రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా సమాచారం తెలుసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లోనే మిస్టరీని ఛేదించామన్నారు.

పాలకొండ సీఐ జి.శంకరరావు, దోనుబాయి, బత్తిలి, పాలకొండ ఎస్సైలు కిశోర్‌వర్మ, డి.అనిల్‌కుమార్‌, ప్రసాద్‌ ఆయా ప్రాంతాలకు వెళ్లి వివరాలు సేకరించారని, రెండూ హత్యలుగా తేలినట్లు చెప్పారు. హత్యలకు కారకులు, ప్రేరేపించినవారు, పంచాయతీ నిర్వహించిన పెద్దలు.. ఇలా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details