Man arrested for taking nude pictures of women: ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌వర్మ సాయంతో వ్యభిచార ముఠా ఆగడాలకు కళ్లెం వేయగలిగారు. ఆదివారం సాయంత్రం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, బసవకల్యాణ్ తాలూకా, రాజేశ్వర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్(35) లారీడ్రైవర్. కలబురిగి ప్రాంతానికి చెందిన వ్యభిచార గృహాల నిర్వాహకుడు గులాంకు ప్రధాన అనుచరుడు.
అతడి ఆదేశాలతో వారం రోజుల క్రితం హుస్సేన్ పాతబస్తీ చేరాడు. బార్కస్ సలాలాలో నివాసం ఉంటున్న తన మరదలిని సంప్రదించాడు. ఇక్కడే ఏదన్నా పని వెతుక్కుంటానని ఈ ప్రాంతంలో గది అద్దెకు కావాలని అడిగాడు. బావ కావడంతో తన ఇంట్లోనే గది అద్దెకు ఇవ్వగా... పాతబస్తీలో తిరుగుతూ ఉపాధి వెతుక్కుంటున్నట్లు నమ్మించేవాడు. ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం గాలించేవారు.
కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ మహిళలకు మాటలతో గాలం వేసి, తన గదికి తీసుకొచ్చేవాడు. వారి ముఖం, పాదాలు కనిపించకుండా సెల్‌ఫోన్‌లో వారి మిగిలిన శరీర భాగాల చిత్రాలు, వీడియోలు తీసేవాడు. వాటిని కలబురిగిలోని గులాంకు వాట్సప్ ద్వారా చేరవేసేవాడు. వాటిని చూసి గులాం వారికి ధర నిర్ణయించేవాడు. వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు సమాచారం.