తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఒంటరి మహిళలే అతడి టార్గెట్​.. ఆభరణాల కోసం హత్యలకూ వెనకాడకుండా..! - మెదక్​లో బంగారం దొంగ అరెస్టు

ఈజీ మనీకి అలవాటు పడి.. జల్సాలకు తక్కువ కాకుండా చూసుకోవడానికి ఒంటరి మహిళలను టార్గెట్​ చేస్తాడు. ఎవరూ లేని సమయంలో అదను చూసి వారిని అతి కిరాతకంగా హత్య చేసి.. వారి వద్ద ఉన్న ఆభరణాలు దోచుకుంటాడు. మెదక్​ జిల్లాలో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న యువ హంతకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.

Gold thief arrested
బంగారం దొంగ అరెస్టు

By

Published : Dec 30, 2022, 8:46 PM IST

జల్సాలకు అలవాటుపడి వృద్ధులు, ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి పుస్తెలతాడు, చెవి రింగులు ఎత్తుకెళ్తూ హత్యలు చేస్తున్న యువ హంతకుడిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ నెల 24న జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలోని పెద్ద బజారులో తలకుల సుజాతను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసి.. ఆమె మెడలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లిన దుండగులపై కుటుంబసభ్యులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ పట్టణ సీఐ, మెదక్ రూరల్ సీఐ మధు, విజయ్​లు దర్యాప్తు చేపట్టారు.

మార్కెట్​లో కూరగాయలు విక్రయించే సుజాత మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి రాగా.. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని గమనించి పిట్లం బేస్​కు చెందిన వజ్రబోయిన కౌశిక్(27) అనే యువకుడు సుజాత ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై కత్తితో దాడి చేసి బంగారం తీసుకుని.. చీరను గొంతుకు బిగించి హత్య చేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కేసును విచారణ చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే వ్యక్తి 2017లో ఫిబ్రవరి నెలలో సుశీల అనే మహిళను హత్య చేసి ఆమె వద్దనున్న పుస్తెలతాడు, చెవి రింగులు అపహరించినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. 2022 జూన్​లోనూ లక్ష్మీ అనే మరో మహిళపై దాడి చేసి.. ఆమె చనిపోయిందని భావించి ఆమె పుస్తెలతాడు తీసుకొని పారిపోయాడని వివరించారు. నిందితుడు నుంచి పది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని.. అతనిని రిమాండ్​కు తరలించినట్లు మెదక్​ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details