Drunk And Drive Accidents: రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా మందుబాబుల్లో మార్పు రావడంలేదు. తాగి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూనే.. అమాయకుల మరణాలకూ కారణమవుతున్నారు. ఆ మధ్య చిన్నారి రమ్య ఉదంతం నుంచి నిన్న వలస కార్మికులు అయోధ్యరాయ్, దేవేంద్రకుమార్ దాస్‌ల మరణం, అదుపు తప్పిన వేగంతో చెట్టును ఢీకొని మరణించిన అబ్దుల్ రహీం, ఎం.మానస, ఎన్.మానసల ఉదంతాల వరకూ మత్తులో వాహనం నడపడం వల్ల జరిగిన ఘోరాలే.
శిక్షల భయమేదీ?
Cause of major road accidents: మద్యం తాగి వాహనం నడపడం చట్టప్రకారం తీవ్రమైన నేరం. తాగినట్టు పరీక్షల్లో తేలినా వివిధ రూపాల్లో వచ్చే ఒత్తిళ్ల (లంచాలు, తమవారిని కాపాడాలంటూ నేతలు చేస్తున్న పైరవీల వంటివి) కారణంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడం లేదు. తాగి వాహనం నడుపుతూ చనిపోతే బీమా రాదనే కారణంతో మానవతా దృష్టితో నమోదు చేయనివీ ఉంటున్నాయి. శిక్షల భయం లేకపోవడంతో కొందరు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు.
రోడ్లపై దర్జాగా తాగుబోతు డ్రైవర్లు
తాగి వాహనం నడుపుతూ తొలిసారి దొరికినా డ్రైవర్ లైసెన్స్‌ను కొంతకాలం సస్పెన్షన్‌లో ఉంచాలని కేంద్ర మోటారు వాహనాల చట్టం చెబుతోంది. వాస్తవంలో ఇది అమలు కావడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కిన తర్వాత లైసెన్స్ రద్దుకు పోలీసులు సిఫారసు చేస్తున్నా, రవాణా శాఖ దాన్ని ఆచరించడంలేదు. ఉదాహరణకు ఏపీ09బీక్యూ4199 నంబరుగల వాహనదారు 2020 జనవరి 10న, ఫిబ్రవరి 7న; టీఎస్09ఈబీటీఆర్ 4570 నంబరు గల వాహనదారు 2020 అక్టోబరు 26న, ఈ ఏడాది జనవరి 19న తాగి నడుపుతూ చిక్కారు. వీళ్లే కాదు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 20,739 మంది మద్యం తాగిన డ్రైవర్లు మళ్లీ మళ్లీ వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడినట్లు విశ్లేషణలో వెల్లడైంది.
మూడోవంతు ఇవే
- రాష్ట్రంలో మూడొంతుల రోడ్డు ప్రమాదాలకు మద్యం మత్తే కారణమని అనధికారిక అంచనా. పోలీసు రికార్డుల్లో మాత్రం ఇవి ఒక శాతానికి మించడంలేదు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం తెలంగాణలో 2019లో 21,570 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వీటిలో మద్యం మత్తు కారణంగా చూపినవి 246 మాత్రమే (1.1 శాతం).
- ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ మద్యం తాగాడా? లేదా? అన్నది పరీక్షించకపోవడమే సంఖ్య తక్కువగా నమోదవడానికి కారణం. వాస్తవంగా ఇది దానికి ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని అంచనా.
- తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,35,915 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదవడమూ పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
మద్యం మత్తు వాహనం నడిపే డ్రైవర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ప్రమాదాలకు ఎలా కారణమవుతుంది? నిపుణుల విశ్లేషణ ఇలా..
* వైఖరి: మామూలు సమయంలో వాహనాన్ని నిదానంగా నడిపే వ్యక్తి, మత్తు తలకెక్కగానే దూకుడు ప్రదర్శిస్తాడు.