రాయదుర్గం ఠాణా టెలికాం నగర్‌లోని ఓ ఇంట్లో వాచ్‌మెన్, అతడి భార్య రూ.1.1 కిలోల బంగారం, రూ. లక్షలు దొంగతనం చేసిన సంగతి తెలిసిందే. అయితే, చోరీ చేసిన తర్వాత నిందితులు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. కాకపోతే.. అంతకు ముందు అదే చరవాణిలో వేరే సిమ్‌కార్డు వేసి తెలిసిన వ్యక్తులకు కాల్ చేశారు. ఆ నంబర్ ఎవరికీ తెలియదని అనుకున్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వివరాలు కనిపెట్టారు. ఆ నంబర్ నుంచి ఎవరెవరికి.. ఎక్కడెక్కడికి ఫోన్‌కాల్స్ వెళ్లాయో ఆరా తీసి అప్రమత్తమయ్యారు. చివరకు.. మీరు రండి.. ఆశ్రయం ఇచ్చే బాధ్యత నాది అంటూ నిందితులకు భరోసానిచ్చిన వ్యక్తి వివరాలు రాబట్టారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దొంగలు ‘షోలాపూర్’లో తలదాచుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
రెండు నెలల తర్వాత వెళ్దామని..
టెలికాం నగర్ దొంగతనం కేసులో నిందితులైన లంక బహదూర్ సాహీ, ఖడ్కే పవిత్ర పోలీసులకు చిక్కకుండా పక్కాగా ప్రణాళికా రూపొందించుకున్నారు. దిల్లీ, ముంబయి, లక్నో తదితర నగరాలైతే దొరికిపోయే ప్రమాదముందని గుర్తించి ‘షోలాపూర్’ను ఎంచుకున్నారు. అక్కడ.. ఇక్కడా తిరిగి పోలీసులకు చిక్కే 24 గంటల ముందు స్థానికంగా ఓ గదిని అద్దెకు తీసుకుని రెండు నెలల అడ్వాన్స్ చెల్లించారు. రెండు నెలలు ముగిసిన తర్వాత పోలీసులు ఈ కేసును పట్టించుకోరని.. అప్పుడు తీరిగ్గా నేపాల్‌కు వెళ్లిపోవాలని భావించారు. తాము బయటికొస్తే ఎవరైన గుర్తు పట్టే ప్రమాదముందని తొలిరోజంతా గదికే పరిమితమయ్యారు. ఆ క్రమంలోనే చోరీ చేసిన బంగారాన్ని ముద్దగా చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వెళ్లడం ఒకటి, రెండ్రోజులు ఆలస్యమై ఉంటే ఆ ప్రక్రియ సైతం పూర్తయ్యేది.