హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉంటూ హత్యకు గురైన ఏపీలోని ప్రకాశం జిల్లా రాజపాలెం యువకుడు నారాయణరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పరువు కోసం యువతి తండ్రి వెంకటేశ్వర్ రెడ్డి ఈ హత్య చేయించినట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. కూతురికి వేరే పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే యువతి తండ్రి వెంకటేశ్వర్ రెడ్డి, బంధువు శ్రీనివాస్ రెడ్డికి రూ.4.50 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు వెల్లడించారు. ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డి, కాశీ, షేక్ అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నారాయణరెడ్డి మామ వెంకటేశ్వర్ రెడ్డి, బావమరిది చంద్రశేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశాం. నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, కాశీ, షేక్ఆశిక్. మరో ఇద్దరు నిందితులు వెంకటేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పరారీలో ఉన్నారు. పోలీసులకు విషయం తెలిసిందని శ్రీనివాస్‌రెడ్డి, ఆశిక్లు విషం తాగారు. విషం తీసుకున్న ఇద్దరూ కోలుకోవడంతో ఇవాళ అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాం.-శిల్పవల్లి, మాదాపూర్ డీసీపీ
అసలేం జరిగింది..
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 1లో నారాయణరెడ్డి తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఓ యువతిని నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా యువతి, నారాయణరెడ్డి ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నారాయణరెడ్డి కనిపించకపోవడంతో జూన్ 30న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.