'మా పెళ్లికి వాళ్లు ఒప్పుకోరు.. అందుకే చనిపోతున్నాం' - nirmal district crime news
"నా గర్ల్‌ఫ్రెండ్‌ది నాదీ వేర్వేరు కులాలు. మా పెళ్లికి వాళ్ల అమ్మ, బావ ఒప్పుకోరు. వాళ్లు ఒప్పుకోకుండా మేం పెళ్లి చేసుకోలేం. అలాగని ఒకర్ని వదిలి మరొకరం బతకలేం. అందుకే చనిపోదామని నిర్ణయించుకున్నాం. అమ్మా.. అన్నా.. నన్ను క్షమించండి." అంటూ 20 ఏళ్ల యువకుడు అతని ప్రేయసి(18) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోనని ఊహించుకుని ప్రాణాలు తీసుకున్నారు.
జీవితంపై ఇంకా పూర్తిగా అవగాహనలేని వయసులోనే ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించరని ఊహించుకొని చిన్న వయసులోనే ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో బుధవారం జరిగింది. మామడ ఎస్‌ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పొన్కల్‌కు చెందిన హరీష్(20), నిశిత(18) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో యువతి ఇంట్లో ఎట్టి పరిస్థితిల్లోనూ ఒప్పుకోరని యువకుడు భావించాడు. ‘ఇద్దరం కలిసి బతకాలనుకున్నాం.. బతకాలంటే విడిపోవాలి.. వేర్వేరుగా ఉండలేనందున మేము చావాలని నిర్ణయించుకుంటున్నాం’అని హరీష్ తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. స్నేహితులు, బంధువులు అది చూసి పలుచోట్ల వెతికారు. అతని జాడ ఎక్కడా లేకపోవడంతో నిశిత ఇంటికెళ్లగా తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా ఇద్దరు దూలానికి వేలాడుతూ కనిపించారు. బతికి ఉన్నారని కిందకు దించగా అప్పటికే ఇద్దరూ ప్రాణాలు వదిలారు.
పొన్కల్‌లో విషాదం..
డిగ్రీ చదువుతున్న హరీష్, ఇటీవలే ఇంటర్ పూర్తయిన నిశిత ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఎంతో భవిష్యత్తున్న ఆ ఇద్ద్దరూ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కులాలు వేరని పెద్దలు ఒప్పుకోరని ముందే తెలుసుకున్న ఆ ఇద్దరూ పెళ్లికి సంబంధించిన ప్రస్తావన పెద్దగా రాకముందే పెద్దలు కఠినమైన నిర్ణయాలు తీసుకోకున్నా తొందరపాటు నిర్ణయంతో లోకాన్ని వీడారు.
- ఇదీ చదవండి :వేణుగానం కంటే.. మాటలతోనే ఎక్కువ తుంపర్లు