ఆ అమ్మాయి వయసు.. మేజర్ అయ్యేందుకు సుమారు 2 నెలలు తక్కువ. ఆ యువకుడు ఇప్పటికే మేజర్. ఇద్దరూ ఒకే ఊరికి చెందిన వాళ్లు. మనసు ఇచ్చి పుచ్చుకున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. కానీ.. చాలా ప్రేమ కథల్లో మాదిరిగానే వీరికీ పెద్దల నుంచి తిరస్కారం ఎదురైంది. ఆ తరుణంలో బయటికి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ... అమ్మాయి కుటుంబీకులు పెట్టిన మిస్సింగ్ కేసు.. వారిని ఆవేదనకు గురి చేసింది.
పోలీసులకు తాము పట్టుబడితే.. విడదీస్తారేమోనన్న ఆవేదన వారిని వెంటాడింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. ఆ ప్రేమ జంట సెల్ఫీ వీడియో తీసి.. ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్ల పల్లి పరిసరాల్లో ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. పోలీసులు పరుగులు పెడుతున్నారు. ఇద్దరి ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు. ఆ జంట ఎక్కడుందో.. ఎలా ఉందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
"ఎస్సై మేడమ్.. నా పైన మిస్సింగ్ కేసు ఉంది. నా అదృశ్యానికి ఎవరూ కారణం కాదు. నాకు తెలిసే నేను బయటికి వచ్చాను. నేను బయటికి వచ్చినప్పటికి నాకు 17 సంవత్సరాలు. 18 ఏళ్లు నిండేందుకు నాకు 2 నెలలు తక్కువ ఉంది. ఇప్పుడు పోలీసులకు చిక్కితే.. మమ్మల్ని విడదీసేస్తారు. అది మాకు తెలుసు. అందుకని మేం చనిపోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మేం చనిపోబోతున్నాం. మాకు ఈ జీవితం అక్కర్లేదు. మా వాళ్లను చాలా కష్టపెట్టాం. ఇంక ఆ అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం."