ఆ ఆసుపత్రిలో.. ఆ వైపు యువకుడు.. ఈ వైపు యువతి... ఇద్దరూ చావుబతుకుల మధ్య పోరాటం.... మొదట యువకుడు తనువు చాలించగా- ఆ తర్వాత రెండు నిమిషాలకే.. యువతీ కన్నుమూసింది...
టీనేజీ ప్రేమ.. ఆకర్షణ అని సర్దిచెప్పారు. అంతరాల పేరుతో హెచ్చరించారు.. సామాజిక వర్గాలు వేరంటూ మందలించారు.. కానీ, ఆ యువతీ యువకులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. పెళ్లి చేస్తామని చెబుతూనే.. పెద్దలు తమను మోసం చేస్తున్నారని మదనపడ్డారు. చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. విషగుళికలు తిని బల వన్మరణానికి పాల్పడ్డారు. అపరిపక్వత.. ఆవేదన.. ఆవేశం.. కలగలిసి.. అందరూ మెచ్చేలా బతికిచూపిద్దామన్న నిర్ణయానికి బదులు... తనువులు చాలించారు. నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడంతోపాటు తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ ప్రేమకథ విషాదాంతం పలువురిని కలచివేసింది.
ఆత్మకూరు మేదరవీధికి చెందిన నవీన్(19), ఆయిషా (18) టీనేజీలోనే ప్రేమలో పడ్డారు. అయిదేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మధ్యలో రెండుసార్లు కలిసి జీవించాలని వెళ్లిపోయారు. అప్పట్లో వారు మైనర్లు కావడంతో పెద్దలు వెతికి పట్టుకుని.. ఎవరిళ్లకు వారిని తీసుకువెళ్లారు. ఆ తర్వాత వారి ప్రేమ కొనసాగింది. ఆరు నెలల కిందట ఆయిషా నవీన్ ఇంటికి వచ్చేయగా- మేమే మీకు పెళ్లి చేస్తామని నచ్చజెప్ఫి. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. కానీ, వారి ప్రేమను పెద్దలు స్వాగతించలేకపోయారు. ఇద్దరివీ పేద కుటుంబాలే అయినా.. సామాజికవర్గాలు వేరు కావడంతో వీరి ప్రేమకు తోడ్పాటు లభించలేదు.