పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించందనే కోపంతో ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రేమికుడు. వెంకట్రావుపల్లి గ్రామంలోని కెకె నగర్‌కు చెందిన గొడుగు అంజలి(25) డిగ్రీ చదువుతోంది. ఆ పక్కనే ఉన్న తారకరామారావు నగర్‌కు చెందిన చాట్ల రాజు(30).. అడపాదడపా మెకానిక్ పనులు చేస్తుంటాడు. పక్కపక్క వీధుల్లోనే ఉండటం వల్ల వీళ్లిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది. అది కాస్తా ప్రేమగా మారింది.
పెళ్లికి ఒప్పుకోకపోవటం వల్ల..
ఇలా మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ అంజలిని రాజు చాలా సార్లు అడిగాడు. యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియటంతో పెళ్లికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు చెప్పిన కారణాల వల్లో.. లేదా భయపెట్టటం వల్లో.. అంజలి కూడా వారి నిర్ణయానికే తలొంచింది. ప్రియురాలి నిర్ణయంతో ఏకీభవించని రాజు.. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని వేధించసాగాడు. ఈ క్రమంలోనే రెండు సార్లు పంచాయితీ కూడా జరిగింది.